దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో నష్టాల వారం..
* గతవారం నష్టాల్లో క్లోజ్,తాజావారంలోనూ అదే ధోరణి.. * మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్ల సంపద ఆవిరి.. * అక్షరాలా 11.57 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం..
దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో నష్టాల వారం నమోదయింది..గతవారం నష్టాల్లో ముగియగా తాజావారంలోనూ అదే ధోరణిన సూచీలు కొనసాగాయి. మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు 11.57 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోవాల్సివచ్చింది. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి 197.46 లక్షల కోట్ల నుంచి 186.12 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. వీకెండ్ ఒక్కరోజే అక్షరాలా 2.01 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. గతఆరురోజుల్లో సెన్సెక్స్ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్ల మేర కోల్పోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు డబుల్ హ్యాట్రిక్ నష్టాలను చవిచూశాయి. ప్రతి సెషన్ లోనూ అమ్మకాల ఒత్తిడితో బలహీనంగా ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ నష్టాల దిశగా పయనించాయి గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు కేంద్ర బడ్జెట్ పట్ల అప్రమత్తత విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పాటు మదుపర్ల లాభాల స్వీకరణ వెరసి మార్కెట్లను నష్టాల దిశగా నడిపించాయి.
వారాంతపు సెషన్ కు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది.ఫలితంగా దేశీ సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాల్లో ముగిశాయి.