పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు

* తెలంగాణలో పెట్రోల్‌పై 35.2, డీజిల్‌పై 27.3 శాతం వ్యాట్ * ఏపీలో పెట్రోల్‌పై 35.77, డీజిల్‌పై 28.08 శాతం వ్యాట్

Update: 2021-11-06 06:48 GMT

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు(ఫైల్ ఫోటో)

VAT on Petrol-Diesel: కేంద్రం ఇంధన ధరలను తగ్గించిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. ధరలను తగ్గించాలని ప్రతపక్షాలు, ప్రజా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా వ్యాట్‌ను తగ్గిస్తూ ఇతర రాష్ట్రాలకు సవాల్ విసురుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించగా తెలుగు రాష్ట్రాలు మాత్రం సైలంట్‌గా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటన తర్వాత దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైతం ముందుకొచ్చి లీటరుకు 7 రూపాయల వరకు అమ్మకపు పన్ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం, దానిపై విధించిన వ్యాట్ తగ్గింపునకే పరిమితం కావడంతో అక్కడి ప్రజలకు కొంతమేర మాత్రమే ఊరట లభించింది.

పెట్రో ధరలు ఇప్పటికీ గరిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలవగా, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. పన్ను తగ్గింపుపై ఈ రాష్ట్రాలు తమ విధానాన్ని స్పష్టం చేయలేదు. ఇక వ్యాట్ ద్వారా వేలాది కోట్ల రాబడి పొందుతున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 35.77 శాతం, డీజిల్‌పై 28.08 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 27.3శాతం, కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 33 రూపాయలు, డీజిల్‌పై 32 రూపాయల పన్నుతో వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట ఇస్తుందా? లేదా? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అటు ఏపీలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ధరలను తగ్గించాలని నిరసనలు చేస్తోంది.

Tags:    

Similar News