వారికి బ్యాడ్‌న్యూస్.. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..!
Airlines: రానున్న రోజుల్లో విమాన ప్రయాణం చేయడం మరింత కష్టమవుతుంది. స్పైస్‌జెట్ తర్వాత ఇప్పుడు మరో విమానయాన సంస్థ టిక్కెట్ల ధరలను పెంచబోతోంది.
Airlines: రానున్న రోజుల్లో విమాన ప్రయాణం చేయడం మరింత కష్టమవుతుంది. స్పైస్‌జెట్ తర్వాత ఇప్పుడు మరో విమానయాన సంస్థ టిక్కెట్ల ధరలను పెంచబోతోంది. పెరుగుతున్న చమురు ధరలపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీలుగా పన్ను తగ్గించాలని, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఇండిగో ఒక ప్రకటనలో "విమానయాన రంగం పునరుద్ధరణకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందగలిగేలా ATFని GST పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాం" అని పేర్కొంది. నానాటికీ పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి విలువ క్షీణించడం వల్ల విమానయాన రంగం ప్రతికూలంగా ప్రభావితమవుతోందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. స్పైస్‌జెట్ విమాన టిక్కెట్ల ధరలను 10-15 శాతం పెంచడం గురించి ఈ విధంగా వివరణ ఇచ్చింది. 'వాయు ఇంధన ధరలు 16.3 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) రికార్డు స్థాయికి చేరుకుంది' దీంతో ధరలు పెంచామని తెలిపింది.
6 నెలల్లో ధరలు అనేక రెట్లు
విమానయాన సంస్థలకు కిలోలీటర్‌కు రూ. 1.41 లక్షలకు ATF అందుబాటులో ఉంది. ఏడాది ప్రారంభంలో కిలోలీటర్‌కు రూ.72,062 ఉండగా గత ఆరు నెలల్లో ఏటీఎఫ్ ధరలు అనేక రెట్లు పెరిగాయి. స్పైస్‌జెట్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ విమానయాన సంస్థలు సజావుగా నడపడానికి ఛార్జీలను 10-15 శాతం పెంచడం తప్ప మరేమి చేయలేమని తెలిపారు.