Top-6 News of the Day: తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్: మరో 5 ముఖ్యాంశాలు
1. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్
చదువు యాదయ్య పోలీస్ శాఖలో అనే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. గొలుసు దొంగతనాలు, ఆయుధాల డీలింగ్ కు పాల్పడుతున్న రాహుల్, ఇషాన్ నిరంజన్ లను 2022 జులై 25న అడ్డుకున్నారు. ఈ సమయంలో దుండగులు ఆయనపై దాడి చేశారు. ఆయన ఛాతీపై దాడికి దిగారు. అయినా కూడా ఆయన వెనక్కు తగ్గలేదు. ఈ సాహసానికి గాను ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకానికి ఎంపికయ్యారు.
2. ఏపీలో 16 మంది ఐపీఎస్అధికారులకు మెమోలు
ఆంధ్రప్రదేశ్ లోని పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులకు డీజీపీ బుధవారం మెమోలు జారీ చేశారు. ప్రతి రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డీజీపీ కార్యాలయంలోనే ఉండాలన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం గద్దెదిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషాంత్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేట్, పాలరాజు, పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కాంతిరాణా టాటా, అమ్మిరెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, విజయరావు, రవిశంకర్ రెడ్డి, విశాల్ గున్ని, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి లకు మొమోలు జారీ చేశారు. ప్రతి రోజూ విధులు ముగిసిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని డీజీపీ ఆదేశించారు.
3. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు: ఏం జరిగిందంటే?
జూనియర్ ఎన్టీఆర్ జిమ్ చేస్తున్న సమయంలో ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయితే ఆయనకు పెద్ద ప్రమాదం జరిగిందని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన టీమ్ ప్రకటించింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గాయమైనా మంగళవారం దేవర షూటింగ్ ఆయన పాల్గొన్నారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు జూనియర్ కు సూచించినట్టుగా సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఆయన నటిస్తున్నారు.
4. ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని సిఫారసు చేసింది. అయితే ఈ నియామకాలను అప్పట్లో గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ నిలిపివేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫారసు చేసింది. దీంతో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. మరోవైపు తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను రిక్రూట్ చేయవద్దని కోరుతూ సుప్రీంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
5. వల్లభనేని వంశీపై ఈ నెల 20 వరకు చర్యలొద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశం
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది. ఈ నెల 20 వరకు వంశీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆయన గెలిచారు. ఈ సారి వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 2019 తర్వాత రాజకీయ పరిణామాల్లో టీడీపీకి దూరమై వైఎస్ఆర్ సీపీలో ఆయన చేరారు
6. మళ్లీ ఉద్యమానికి సిద్దమైన విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఈ నెల 22న ఫ్యాక్టరీ సీఎండీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై 13న విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సమస్యే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై ప్రధానితో మాట్లాడి స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే నెల రోజులు దాటింది. అయితే ముడిసరుకు లేక ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలతో ఫ్యాక్టరీని మళ్లీ ప్రైవేటీకరిస్తారనే అనుమానాలను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.