Top-6 News of the Day: త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీకి రేవంత్ హామీ: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-08-26 13:16 GMT

Top-6 News of the Day

1. త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్ రెడ్డి

త్వరలోనే 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1 లక్ష ఆర్ధిక సహాయం అందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 135 మంది అర్హత సాధించారు. సోమవారం సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ చెక్కులను అందించారు. మొత్తం 135 మందిలో 113 మంది పురుషులు, 22 మంది మహిళలున్నారు.

2. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ: మంత్రి నారాయణ

టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తామన్నారు. టీడీఆర్ లో రూ. 2 వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. మున్సిపల్ శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

3. పాకిస్తాన్ లో కాల్పులు: 33 మంది మృతి

పాకిస్తాన్ బలూచిస్తాన్ ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు సాయుధులు వాహనాలను నుంచి ప్రయాణీకులను దించి కాల్పులు జరిపారు. బలూచిస్తాన్ ఖలాత్ జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పోలీసు అధికారులున్నారు.

4. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూతురికి బెదిరింపులు: బాలల హక్కుల కమిషన్ సీరియస్

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూతురిపై అత్యాచారం చేసిన వారికి భారీ రివార్డ్ అందిస్తామని బెదిరింపులు పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది.

5. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలి: హరీష్ రావు

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన కోరారు.తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

6. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: ఏలేటి డిమాండ్

పాతబస్తీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తెరమీదికి తెచ్చిందని చెప్పారు. హైడ్రాతో తేనెతుట్టెను రేవంత్ కదిపారని ఆయన అభిప్రాయపడ్డారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News