EV: ఈ ఎలక్ట్రిక్ కారు 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.. రయ్‌రయ్‌ అని దూసుకెళ్లచ్చు!

BYD EV car: BYD అభివృద్ధి చేసిన ఐదు నిమిషాల్లో ఛార్జ్ అయ్యే టెక్నాలజీ, ఎలక్ట్రిక్ కార్ల రంగాన్ని మార్చే అవకాశముంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు కొత్త పోటీని తీసుకువచ్చే పరిణామం.

Update: 2025-03-29 03:00 GMT
EV

EV: ఈ ఎలక్ట్రిక్ కారు 5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.. రయ్‌రయ్‌ అని దూసుకెళ్లచ్చు!

  • whatsapp icon

BYD EV car: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కానీ వీటిని త్వరగా ఛార్జ్ చేయలేనటువంటి సమస్య, చాలా మందిని వాటిని కొనుగోలు చేయాలన్న ఆలోచననుంచి వెనక్కి నెట్టింది. పెట్రోల్ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ చైనా కంపెనీ BYD ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నంలో ఉంది.

BYD అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీ ప్రకారం, కేవలం ఐదు నిమిషాల్లో ఒక ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ అవుతుందట. ఈ టెక్నాలజీ ద్వారా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసిన కారు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది ప్రతి ఒక సెకన్‌కు రెండు కిలోమీటర్ల చొప్పున ఛార్జ్ అవుతున్నదన్న అర్థం. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వ్యక్తి వాంగ్ చౌన్‌ఫు, తన లక్ష్యం కారు పెట్రోల్ నింపే సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయగలగడం అని చెబుతున్నారు.

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన 1 మెగావాట్ పవర్‌కు తట్టుకునే బ్యాటరీని BYD రూపొందించింది. దీనితో పాటు, వేగంగా అయాన్లు కదలేందుకు సహాయపడే ప్రత్యేకమైన చిప్‌ను కూడా అందులో ఏర్పాటు చేశారు. ఇంత వేగంతో ఛార్జింగ్ జరిగే సమయంలో ఉత్పన్నమయ్యే అధిక వేడిని నియంత్రించేందుకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.

అయితే, ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు సాధారణ ఛార్జింగ్ స్టేషన్లు సరిపోవు. దీనికి ప్రత్యేకమైన అధిక విద్యుత్ సామర్థ్యం గల స్టేషన్లు అవసరం. ప్రస్తుత విద్యుత్ గ్రిడ్‌లు ఇంత అధిక శక్తిని సమర్ధవంతంగా పంపిణీ చేయలేవు. అందుకే BYD చైనాలో 4,000 ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని ప్రణాళిక రచించింది.

ఈ కార్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్‌కే పరిమితం. అక్కడి స్పందన ఆధారంగా భవిష్యత్తులో ఇతర దేశాల్లోకి విస్తరించే యోచనలో ఉంది. ఇది టెస్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు గట్టి పోటీగా మారనుంది. BYD కార్లు తక్కువ ధరతో మార్కెట్‌లో ఉంటుండగా, ఇప్పుడు వేగంగా ఛార్జ్ అయ్యే టెక్నాలజీని జత చేయడం ఈ పోటీలో మరింత ఆధిక్యతను కలిగించవచ్చు.

ఈ అభివృద్ధి వల్ల ఇప్పటికే కొన్ని కంపెనీలు పెట్టుబడి చేసిన బ్యాటరీ మార్పిడి ప్రణాళికలకు తీవ్ర ఒడిదుడుకులు రావచ్చు. వేగంగా ఛార్జ్ అయ్యే కార్లు అందుబాటులోకి వస్తే, స్వాప్ స్టేషన్ల అవసరం తగ్గిపోతుంది. దీనితో పాటు, వేగంగా ఛార్జ్ అయ్యే సాంకేతికతకు సంబంధించి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. అధిక ఉష్ణ ఉత్పత్తి, ఖర్చు పెరుగుదల, విద్యుత్ గ్రిడ్ పై ప్రభావం వంటి సమస్యలు మిగిలే అవకాశముంది.

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మూడు చక్రాల వాహనాలలో ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. కార్ల విభాగంలో కూడా అభివృద్ధికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ క్రమంలో BYD లాంటి కంపెనీలు తమ టెక్నాలజీతో భారత మార్కెట్లో ప్రవేశిస్తే, మార్పు తక్కువ సమయంలోనే స్పష్టంగా కనిపించొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా టెస్లా, బెంజ్, BYD లాంటి కంపెనీలు వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం కలిగిన కార్లపై దృష్టి పెట్టాయి. ఇప్పటివరకు టెస్లా 15 నిమిషాల్లో 275 కిలోమీటర్లు, బెంజ్ 10 నిమిషాల్లో 325 కిలోమీటర్లు ఛార్జ్ అయ్యే సామర్థ్యం కలిగిన కార్లను పరిచయం చేశాయి. ఇప్పుడు BYD ఐదు నిమిషాల్లో 400 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం కలిగిన కారును తీసుకొస్తోంది. ఇది ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద మార్పుకు నాంది కావొచ్చు.

Tags:    

Similar News