YV Subba Reddy: 'షర్మిలా.. మీ పోరాటం ఆస్తుల కోసమా, జగన్ బెయిల్ రద్దు కోసమా?'
టీడీపీ కుట్రలో వైఎస్ షర్మిల భాగమయ్యారని ఆయన చెప్పారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఆస్తుల కోసం పోరాడుతున్నారా ? లేక జగన్ బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి షర్మిలను ప్రశ్నించారు.శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాజీ మంత్రి పేర్నినానితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ కుట్రలో వైఎస్ షర్మిల భాగమయ్యారని ఆయన చెప్పారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉన్నవారికే డివిడెంట్లు వస్తాయన్నారు. షేర్లను బదలాయించినందునే జగన్ ఎన్ సీ ఎల్ టీని ఆశ్రయించారన్నారు.
హైకోర్టు స్టేటస్ కో ఉన్నా షేర్లను బదిలీ చేశారని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ లు కలిసి జగన్ పై కేసు పెట్టాయని ఆయన ఆరోపించారు. చెల్లెలిపై ప్రేమ ఉన్నందున జగన్ ఎంఓయూ చేశారని ఆయన తెలిపారు. ఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.. గత మూడు, నాలుగు రోజులుగా టీడీపీ జగన్ పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈ షేర్ల బదిలీపై ఎన్ సీ ఎల్ టీలో కేసు దాఖలు చేయకపోతే ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ షేర్లను బదిలీ చేశారని ఈడీకి ఫిర్యాదు చేస్తే జగన్ కు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు ఎన్ సీ టీఎల్ లో జగన్ కేసు దాఖలు చేశారని ఆయన వివరించారు.
ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇవ్వాలని అనుకున్నందునే షర్మిలతో జగన్ ఎంఓయూ చేసుకున్నారని ఆయన చెప్పారు. జగన్ స్వార్జితమైన ఆస్తులుగా ఈ ఎంఓయూలో ఉందని...ఇది చదివిన తర్వాతే షర్మిల సంతకం పెట్టారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ బతికున్న రోజుల్లోనే కొన్ని ఆస్తులను జగన్ కు, షర్మిలకు పంచారని చెప్పారు. వైఎస్ఆర్ బతికున్న సమయంలోనే జగన్ పెట్టిన కంపెనీల్లో షర్మిల కానీ, ఆమె భర్త కానీ డైరెక్టర్లుగా లేరని సుబ్బారెడ్డి తెలిపారు.
వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన షర్మిల: పేర్నినాని
వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలనుకొనేవారు చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వాటాల వద్దే వైఎస్ఆర్ పేరు బొమ్మ వాడుతున్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ ను దెబ్బతీయాలని ప్రయత్నించిన వారితో కలిసి తిరిగే సమయంలో ఆయన గుర్తుకురావడం లేదా అని నాని అడిగారు