YS Vijayamma Open Letter: 'అన్యాయానికి గురైన బిడ్డ పక్షాన నిలబడడం తల్లిగా నా బాధ్యత'
S Vijayamma open letter: వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఇద్దరు బిడ్డలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ కోరిక అని ఆమె అన్నారు. ఈ ఆస్తులను బాధ్యత గల కొడుకుగా జగన్ సంరక్షించాలని చెప్పారు.
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తెలిపారు. తాను ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్ని తన ముందే జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండడం తల్లిగా తన బాధ్యత అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
విజయమ్మ ఇంకా ఏమన్నారంటే..
షర్మిల, జగన్‌కు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక అని విజయమ్మ తన లేఖ ద్వారా స్పష్టంచేశారు. షర్మిల మేలు కోరేవారిలో తాను మొదటివాడినని వైఎస్ఆర్ మరణానికి కొన్ని రోజులముందే జగన్ మాటిచ్చారని ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు.
నిబంధనలకు విరుద్దంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్లను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు. ఈ షేర్ల బదిలీని నిలిపివేసి పూర్వపుస్థితిని కొనసాగించాలని ఆయన నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యూనల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం బయటకు వచ్చింది. అప్పటి నుండే జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.