YS Sharmila: అవి కుటుంబ ఆస్తులే.. జగన్ వి కావు: వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
Sharmila vs Jagan: వైఎస్ షర్మిల శుక్రవారం వైఎస్ఆర్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.
Sharmila vs Jagan: వైఎస్ షర్మిల శుక్రవారం వైఎస్ఆర్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలిపేందుకు ఈ లేఖ రాసినట్టుగా ఆమె చెప్పారు. జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నానని జగన్ అనడం హాస్యాస్పదమని ఆమె చెప్పారు. తాను సంపాదించినట్టు జగన్ చెప్పుకుంటున్న ఆస్తులన్నీకుటుంబానివేనన్నారు. తన చేతిలో మీడియా ఉందని జగన్ ఏదైనా నమ్మించగలడని ఆమె ఆరోపించారు.
నాన్న గురించి అమ్మ వైఎస్ విజయమ్మ ఓ పుస్తకం రాశారని.. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారని ఆమె గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారెకి లోకం ఒక ఎత్తైతే తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని చెప్పారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని తక్కువ చేసి చూడలేదు. తన నలుగురు మనవళ్లు నాకు సమానమని రాజశేఖర్ రెడ్డి చెప్పేవారని ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. వైఎస్ఆర్ బతికున్న సమయంలో స్థాపించిన కుటుంబ వ్యాపారాల్లో నలుగురు మనవళ్లకు సమాన వాటా ఉండాలి. ఈ కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమేనని ఆమె చెప్పారు. నలుగురికి సమానంగా ఆస్తులను పంచాల్సింది జగనేనని ఆమె తెలిపారు.
సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదలాయింపు విషయమై వైఎస్ జగన్ ఎన్ సీ టీఎల్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ప్రతి ఇంట్లో జరిగే కుటుంబ గొడవలేనని జగన్ చెప్పారు. ప్రతి ఇంట్లో జరిగే సాధారణ గొడవలే అయితే తల్లి, చెల్లిపై కేసు పెడతారా అని షర్మిల జగన్ కు కౌంటరిచ్చారు. తన నలుగురు మనవళ్లకు సమానంగా ఆస్తి దక్కాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమతమని.. అందుకు విరుద్దంగా జగన్ వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.
ఆస్తి పంపకాలు జరగలేదు
ఒక్క సండూర్ పవర్ మినహా రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదు. ఆకస్మాత్తుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. ఆ తర్వాత ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఇవాళ్టికి నాయకు న్యాయంగా రావాల్సిన ఆస్తి నా చేతికి రాలేదు. వైఎస్ఆర్ బతికున్నప్పుడే ఆస్తులు పంచారనేది వాస్తవం కాదని ఆమె చెప్పారు. మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరున ఉంటే అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదని ఆమె చెప్పారు.
ఆస్తులపై మోజు లేదు
నాకు వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదు. వీళ్లు పెట్టిన హింసలకు వారి ఆస్తులు కావాలనే కోరిక కూడా లేదు. నా బిడ్డలకు ఆస్తులు చెందాలని వైఎస్ఆర్ కోరిక అందుకే నేను, అమ్మ తపన పడుతున్నామన్నారు. ఈ విషయమై అమ్మ వెయ్యి సార్లు ఈ విషయమై అడిగి ఉంటుంది. వందల లేఖలు రాసింది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తిలో ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు. నాన్న చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ కు అండగా ఉన్నానని చెప్పారు. ఆయన పార్టీని నా భుజాల మీద మోశానన్నారు.