YS Jagan: తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల తనకు తెలియకుండా షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారని నేషనల్ కంపెనీలా ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ అధినేత
Jagan vs Sharmila: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇంటి గుట్టు మళ్లీ రచ్చ కెక్కింది.
Jagan vs Sharmila: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇంటి గుట్టు మళ్లీ రచ్చ కెక్కింది. అన్నా, చెల్లెళ్ళ మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తాజాగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో ముసలం బయటపడింది. తన చెల్లి, తల్లి తనకు తెలియకుండా ఈ కంపెనీ షేర్లు ట్రాన్స్ ఫర్ చేశారంటూ వైఎస్ జగన్.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఫిర్యాదు చేశారు. ఆయన సెప్టెంబర్ నెలలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఇటీవలే ఆ సంగతి వెలుగులోకి వచ్చింది. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన తల్లి విజయలక్ష్మి, సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అయిన వైఎస్ షర్మిలతో ఆస్తుల వివాదం ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే అన్నకు దూరంగా జరిగిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ ఆస్తుల వివాదం నిజమేనని ఈ గొడవతో తేలిపోయింది.
క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ విజయ రాజశేఖర్‌రెడ్డితో పాటు జనార్దన్ రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రీజనల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గత నెల 3న ఒకటి, 11న మూడు, ఈ నెల 18న ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయలక్ష్మి, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, అయితే, వివిధ కారణాలతో కేటాయింపులు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ షేర్లను ఇప్పుడు విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
సెప్టెంబర్ 3 నాటి పిటిషన్‌కు సంబంధించి రాజీవ్ భరద్వాజ్, సంజయ్‌పురికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణ నవంబర్ 8కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. జగన్ తరపున వై. సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు. తల్లి, సోదరితో ఆస్తుల వివాదానికి సంబంధించి విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నా అవన్నీ ఇప్పటి వరకు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వివాదం ట్రైబ్యునల్ దాకా వచ్చింది.
అయితే ఈ విషయం తెలిసిన వైఎస్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో వారసుల మధ్య ఆస్తుల తగాదా రచ్చకెక్కడంతో వారు విస్మయానికి గురవుతున్నారు. తల్లిని, చెల్లెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్న ఆస్తుల విషయంలో ఇలా ఫిర్యాదు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైనా, అంతర్గతంగా ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. అయితే, ఈ వివాదం రాజకీయంగా వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.