పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్లిపోయిన 'సరస్వతి పవర్' వివాదం

Update: 2024-10-27 15:05 GMT

YS Jagan and YS Sharmila property disputes latest news: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇదివరకు ఎప్పుడూ పెద్దగా వార్తల్లో లేని ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయింది. ఇంట్లో ఆస్తి గొడవతో మొదలైన ఈ వివాదం, అసలు కంపెనీ పుట్టుక, మనుగడలనే ప్రశ్నించే వరకు వెళ్లింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అక్కడి అన్ని రాజకీయ పార్టీలతో పాటు జనం దృష్టి కూడా ఆ ప్రాజెక్ట్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలపైనే ఉంది.

ఇది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ జగన్‌ని ముందు పెట్టి ఆ కుటుంబం మొదలుపెట్టిన ఒక వ్యాపార సంస్థ. విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అప్పట్లో ఈ కంపెనీని స్థాపించారు. అందుబాటులో ఉన్న రికార్డ్స్ ప్రకారం ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచవరం, దాచెపల్లి మండలాల్లో ఈ కంపెనీకి మొత్తం 1515 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడి రైతుల నుంచి సేకరించిన పట్టా భూములేనని తెలుస్తోంది.

ఇందులో ఎవరెవరికి ఎన్ని వాటాలున్నాయి?

వైఎస్ జగన్ చెబుతున్న వివరాల ప్రకారం ఆ కంపెనీలో ఆయనకు 29.88 శాతం , తల్లి విజయమ్మకు 48.99 శాతం, భార్య భారతికి 16.30 శాతం, క్లాసికల్ రియాల్టీ అనే మరో సంస్థకు 4.83 శాతం వాటాలు ఉన్నాయి. జగన్ కోర్టు కేసులు పరిష్కారమైన తరువాత తన సోదరి వైఎస్ షర్మిళకు కూడా కొన్ని వాటాలు బదిలీ చేసే విధంగా 2019 ఆగస్టు 31న ఒక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే తల్లి విజయమ్మను ట్రస్టీగా పెడుతూ ఆ ట్రస్ట్ ద్వారానే కంపెనీ షేర్లు బదిలీ అయ్యేలా నిర్ణయించుకున్నారు. అందుకోసం జగన్, ఆయన భార్య భారతి కొన్ని ఈక్విటీ షేర్లను తల్లి విజయమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేశారు. భవిష్యత్తులో కోర్టు కేసులు తీరిన తరువాతే జగన్, భారతిల అనుమతితో ఆ షేర్లు షర్మిళకు బదిలీ చేయించడం జరుగుతుంది అనేది ఆ ఒప్పందం సారాంశంగా తెలుస్తోంది.

మరి ఇంతలోనే ఏమైంది?

అయితే తాజాగా తమ అనుమతి లేకుండా తమ పేరిట ఉన్న షేర్లను ఈ ఏడాది జులై 6న తల్లి విజయలక్ష్మి పేరు మీదకు బదిలీ అయ్యాయని జగన్ ఆరోపిస్తున్నారు. దీని వెనుక షర్మిళ ప్రమేయం ఉందనేది జగన్ ఆరోపణ. అందుకే ఆ ఇద్దరిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు పెట్టారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీలో తమ అనుమతి లేకుండా జరిగిన ట్రాన్సాక్షన్‌ని రద్దు చేసి, వాటాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాల్సిందిగా జగన్ తన పిటిషన్‌లో ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ జరిగే వరకు ఎక్కడా పెద్దగా వినిపించని సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దివంగత నేత వైఎస్ఆర్ పిల్లలు కావడం, అందులోనూ జగన్ కూడా 5 నెలల క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ ఆస్తుల గొడవకు జాతీయ స్థాయిలో భారీ ప్రాధాన్యత ఏర్పడింది.

మరో కోణంలో వార్తల్లోకెక్కిన సరస్వతి పవర్

ఈ ఆస్తి గొడవ రచ్చకెక్కనంత వరకు స్తబ్దుగా ఉన్న ఈ కంపెనీ వ్యవహారాలు అన్నీ ఒక్కసారిగా హైలైట్ అవడం మొదలయ్యాయి. వైఎస్ జగన్ - షర్మిళ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న పరస్పర ఆరోపణల తరువాత అసలు ఈ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలేంటి? విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా ఏర్పాటైన కంపెనీకి ఆ తరువాత సిమెంట్ ఉత్పత్తి పేరుతో సున్నపు గనులు ఏ ప్రాతిపదికన కేటాయించారు? కంపెనీ కోసం జగన్ హయాంలో ఏ రకమైన మేలు జరిగింది? జల వనరుల కేటాయింపు ఏ మేరకు జరిగాయి? కంపెనీ స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా? ఇలా సవాలక్ష సందేహాలు బయటికొచ్చాయి. అదే సమయంలో కంపెనీ భూముల్లో వాగులు, వంకలతో పాటు 25 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీపై వస్తోన్న ఈ ఆరోపణలను ప్రభుత్వం తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఒకవేళ అందులో వాగులు, వంకలు ఉన్నట్లయితే.. ఆ కంపెనీకి పర్యావరణ శాఖ అనుమతులు ఎలా జారీ చేసిందని ఆయన సందేహం వ్యక్తంచేశారు. అంతేకాదు.. వెంటనే కంపెనీ భూములను సర్వే చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో శనివారమే అక్కడి అధికారులు కంపెనీ భూములను సర్వే చేయడం మొదలుపెట్టారు. భూముల పరిశీలన ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

తొలుత విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ఏర్పడినప్పటికీ, ఆ తరువాత చట్ట ప్రకారం బై లాస్ మార్చుకుని సిమెంట్ తయారీ కంపెనీ కోసం సున్నపు రాయి గనుల లీజు పొందినట్లు సరస్వతి పవర్ కంపెనీ చెబుతోంది. అయితే, ఇందులోనూ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పటి నుండి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది.

చట్ట ప్రకారం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ బై లాస్ మార్చుకున్న తరువాతే సిమెంట్ తయారీ కోసం సున్నపు రాయి గనుల లీజు ఇవ్వాల్సి ఉంటుంది. 2008 జులై 15న సరస్వతి కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుగుణంగా బై లాస్ మార్చుకున్నారు. కానీ అంతకంటే దాదాపు నెల రోజుల ముందే.. అంటే జూన్ 12వ తేదీనే అప్పటికి ఇంకా బై లాస్ కూడా మార్చుకోని ఆ కంపెనీకి మైనింగ్ లీజు కేటాయిస్తూ అప్పటి మైనింగ్ డైరెక్టర్ మెమో జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంపెనీకి అవసరమైన నీటి కేటాయింపుల విషయంలోనూ అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ వైపు చూడని ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలతో అటువైపు దృష్టిసారించింది. దీంతో అన్నాచెల్లెళ్ల ఆస్తి గొడవ ఒక వైపు అయితే.. అసలు కంపెనీ వ్యవహారాలకు ఏ మేరకు చట్టబద్ధత ఉందనేదే ఇప్పుడు ఇంకో హాట్ టాపిక్ అయింది.

ఇదే విషయమై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో రైతుల నుండి వందల ఎకరాలు తీసుకున్నప్పటికీ 15 ఏళ్లుగా పరిశ్రమను స్థాపించలేదన్నారు. అంతేకాదు.. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఒక సోసైటీ ఏర్పాటు చేసి మళ్లీ రైతులకే ఇస్తే కనీసం ధాన్యం ఉత్పత్తి అయినా పెరుగుతుందన్నారు. జగన్ వైఖరితో ప్రస్తుతం విజయమ్మ, షర్మిల భద్రతపై కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తిందని సందేహం వ్యక్తంచేశారు.

ఇలా ఇంటి గొడవతో మొదలైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వివాదం ఇప్పుడు కడప గడప దాటి రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు - ప్రత్యారోపణల వరకు వెళ్లింది. ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయో అనేదే ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న.

Tags:    

Similar News