Corona Vaccine: వ్యాక్సినేషన్‌లో ఎమ్మెల్యేల రూల్స్ బ్రేక్..!
Corona Vaccine: దేశ ప్రధానియే కొవిడ్ సెంటర్‌కు వెళ్లి టీకా తీసుకుంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని మరీ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Corona Vaccine: దేశ ప్రధానియే కొవిడ్ సెంటర్‌కు వెళ్లి టీకా తీసుకుంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని మరీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులకు ఓ నిబంధన, వాళ్లను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మరో నిబంధనా అంటూ మండిపడుతున్నారు ప్రజలు.
గత నెల 31న గోపాలపురంలో తన నివాసానికి వైద్య సిబ్బందిని రప్పించి, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు చిర్ల జగ్గిరెడ్డి. ఆ ఘటన మరువకముందే నిన్న తన నివాసంలో కొవిడ్ టీకా తీసుకున్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్. ఇలా ఇంటికి పబ్లిక్ సర్వెంట్స్‌ను పిలిపించుకొని వ్యాక్సిన్ తీసుకోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
మోడీ అంతటి వారే కొవిడ్ సెంటర్‌కు వెళ్లి టీకా వేయించుకున్నారని, ఎమ్మెల్యేలకు ఎందుకు ఇంత పొగరని విమర్శలు వినబడుతున్నాయి. ఇక ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యేలు ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించడం కోసమే ఇంట్లో టీకా తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు.