Women Attack on Wine Shop: మద్యం షాపుపై మహిళలు దాడి
Women Attack on Wine Shop: మద్య నిషేదం అమలులో భాగంగా ప్రభుత్వమే షాపులు నిర్వహించడం, వీటిని ఏటా తగ్గించుకుంటూ రావడం
Women Attack on Wine Shop: మద్య నిషేదం అమలులో భాగంగా ప్రభుత్వమే షాపులు నిర్వహించడం, వీటిని ఏటా తగ్గించుకుంటూ రావడం, అదేవిదంగా వీటి ధరలను విపరీతంగా పెంచడం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలు కొన్ని చోట్ల మద్య నిషేదానికి అనుకూలంగా ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో మగవారి సంపాదనంతా దీనికే తగలేసే పరిస్థితులొస్తున్నాయి. ఈ విధంగా సంసారాన్ని ఇబ్బందులు పాల్జేస్తున్న దుకాణాలపై మహిళలను విరుచుకుపడుతున్నారు. వీటి వల్లే తమ సంసారాల్లో సమస్యలొస్తున్నాయంటూ మద్యం సీసాలను పగుల కొడుతున్నారు.
ప్రకాశం జిల్లా మహిళలు మద్యంపై యుద్ధం చేస్తున్నారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో మహిళలు ప్రభుత్వ మద్యం దుకాణంపై దాడి చేశారు. అందులో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. తాగుబోతుల ఆగడాలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నామని.. దీనికి తోడు ఈ మద్యం షాపులు తమ కుటుంబాలను మరింత దిగజారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుటుంబంలో మగవారు ఈ షాపుల వద్దే ఉంటున్నారని .. ఇంట్లో ఉన్న నాలుగు పైసలను కూడా మందు కోసం ఖర్చు చేస్తున్నారని వాపోయారు. మగవాళ్లు సంపాదనంతా మందు కోసం తగలేస్తే ఏం తిని బతకాలని ఈ గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. కనీసం కరోనా కనుమరుగయ్యే వరకు మద్యం షాపులు తెరవొద్దని డిమాండ్ చేస్తున్నారు.
ఇతర గ్రామాల నుంచి వస్తున్నవారితో తమ గ్రామంలో కరోనా వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చిన తాగుబోతులు.. మద్యంను కొనుకున్న తర్వాత అక్కడే తాగుతున్నారని… అంతేకాకుండా తమ గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నారని వారు ఆరోపించారు.