Badvel: బద్వేలు ఉపఎన్నిక పవన్‌కు చేదు అనుభవమేనా?
Badvel: బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి జనసేనాని వస్తారా?
Badvel: బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి జనసేనాని వస్తారా? పవన్ రావాలన్న కమలనాథుల ఆశలు తీరుతాయా? వస్తారన్న ఆశతో ఉన్న కాషాయం క్యాంప్ తాజా పరిణామాలపై ఏమంటోంది? అసలు తమతో పొత్తులో ఉన్నారా కత్తులు దింపుతున్నారా తెలియక బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయా? ఇంతకీ బద్వేలు బరిలో బీజేపీ-జనసేన పొత్తుపై జరుగుతున్న చర్చేంటి? ఆ రచ్చేంటి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలోని బద్వేలుకు జరుగుతున్న ఉపఎన్నిక ఉత్కంఠ పోరో, ఉత్తిత్తి పోరో అర్ధం కావడం లేదట బీజేపీకి!! 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధాకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూడా సై అంటే సై అన్నాయి. కాకపోతే, ఏకగ్రీవం అనే సంప్రదాయాన్ని గౌరవిస్తూ జనసేన బద్వేలు బరి నుంచి తప్పుకుంది. టీడీపీ కూడా ఇదే విధానాన్ని పాటించింది. కానీ జనసేన మిత్రపక్షమైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం కుటుంబ పాలనకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూ పోటీకి సిద్ధమయ్యాయి. కానీ ట్విస్టంతా ఇక్కడే ఉంది. మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తుండటంతో జనసేన మద్దతు ఎలా ఉంటుందన్న దానిపై కమలనాథులు తర్జనభర్జన పడుతున్నారు.
కమలం పెద్దల ఒత్తిడితో బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ విజయానికి కృషి చేస్తామని జనసేన ప్రకటించింది. అలా రెండు పార్టీల మధ్య మిత్రబంధం బలంగానే ఉందన్న ప్రచారం జరిగింది. కానీ, మద్దతు మాట అటుంచితే ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న మరో చిక్కుముడి ఎదురయ్యింది. ఈ అంశంపై చర్చ కూడా పెద్దఎత్తున్నే జరిగింది. బీజేపీకి మద్దతు అంటూ ప్రచారంలో జనసేన అధినేత పాల్గొనకుండా త్రీమెన్ కమిటిని ప్రకటించి ముఖం చాటేయడంపై ఇప్పుడు కొత్త చర్చ నడుస్తొంది. బీజేపీకి మద్దతు అని ప్రకటించినప్పుడు ప్రచారంలో పాల్గొనకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదీగాక, ఇటీవలే జనసేనకు, వైసీపీకి మధ్య మాటల యుద్దం జరిగింది. ప్రభుత్వంపై యుద్ధం చేస్తానంటూ పవన్ అప్పట్లో చాలా రూడ్ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్న కమలం పార్టీ బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొంటే మరోమారు వైసీపీపై మాటల తూటలు పేల్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతో ఉంది.
అంతేగాకుండా, సంప్రదాయాన్ని గౌరవిస్తామంటూనే మళ్లీ ప్రచారంలోకి ఎలా వస్తారంటూ సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాటలతో పాటు ప్రచారానికి వస్తానని ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయారన్న విమర్శలను జనసేనాని మూటగట్టుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ప్రచారానికి రాకపోయినా బీజేపీకి మద్దతిచ్చి, ఇటు పూర్తిగా సంప్రదాయాన్ని పాటించక మిత్రధర్మాన్ని పూర్తిస్థాయిలో పాటించక, బద్వేలు ఉపఎన్నిక పవన్‌కు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చక తప్పదంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి, బద్వేలు ఉపఎన్నిక జనసేనానికి ముందు నొయ్యి, వెనక గొయ్యిలా మారిందన్న చర్చ జరుగుతోంది.