గన్నవరం నియోజకవర్గం ఎప్పుడూ హీట్ పాలిటిక్స్‌కు వేదిక రాజకీయ చదరంగంలో ఆ నియోజకవర్గం ఆట నిత్యం రసవత్తరమే. సామాజిక సమీకరణాలు కూడా బలంగా పనిచేసే ప్రాంతం. అన్నింటికీ మించి, మాస్ లీడర్‌గా రెచ్చిపోయే వల్లభనేని వంశీ అక్కడ. మరి ఆ పాపులర్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు అన్వేషణ ఏంటి? పొరపాటున ఇప్పటికిప్పుడు గానీ, కొన్నాళ్ల తర్వాత గానీ బైపోల్స్ వస్తే దుబ్బాక రేంజ్‌లో బాబు, జవాబు ఇవ్వగలరా? గన్నవరం సమరంలో, వంశీపై చంద్రబాబు బీసీ అస్త్రం ఫలితమిస్తుందా?
గరంగరం పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ గన్నవరం. నిత్యం నేతల కయ్యం, మాటల యుద్దంతో పతాకశీర్షికలెక్కుతుంది ఈ నియోజకవర్గం. ఇప్పుడు కూడా గన్నవరం మార్మోగుతోంది. త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని, టీడీపీ తరపున ఎవరు బరిలోకి దిగుతారు...? వల్లభనేని వంశీని ఢీకొట్టే నేత ఎవరు అంటూ, హాట్‌హాట్ డిస్కషన్ సాగుతోంది.
2014, 2019 ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించిన నియోజకవర్గం గన్నవరం. మరోసారి గెలుపుతో, తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు వంశీ. ఎన్నికల్లో విజయం తర్వాత కొద్ది రోజులకు సీఎం జగన్‌ను కలిసి అధికార పార్టీకి మద్దతివ్వడంతో, గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ వెంటనే టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. వంశీ కూడా అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తర్వాత గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. అప్పటి వరకూ వంశీకి ప్రత్యామ్నాయంగా ఎవర్నీ ఆలోచించని చంద్రబాబుకు, ఈసారి అన్వేషణ తప్పలేదు.
రెండుసార్లు వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నుంచి విజయం సాధించారు. వంశీ పార్టీ మారాక, టీడీపీకి సరైన నాయకత్వం దొరకలేదు. జిల్లా బాధ్యతలు చూస్తున్న బచ్చుల అర్జునుడైతే, బెటరని భావించిన చంద్రబాబు, ఆయనను టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు. అయితే బచ్చుల ఎంపిక, గన్నవరం పాలిటిక్స్‌లో అగ్గిరాజేసిందన్న చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పార్టీ చాటు నేతగా, వెనకే వున్న బచ్చులను, సడెన్‌గా తెరపైకి తేవడంతో, క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్స్ వస్తే, పరిస్థితి ఏంటని కంగారుపడుతున్నారట. అయితే, చంద్రబాబు లెక్క వేరు.
గన్నవరంలో కమ్మ సామాజిక వర్గ సమీకరణాలు బలంగా వుంటాయి. వైసీపీ కూడా అదే సామాజివర్గంలో ఉన్న నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నిత్యం ట్రై చేస్తోంది. ఒకవేళ నిజంగా బైపోల్ వస్తే, వంశీ ఎలాగూ వైసీపీ అభ్యర్థిగా సై అంటారు. వంశీ కమ్మ సామాజికవర్గం కాబట్టి, చంద్రబాబు బీసీ వ్యూహం వేశారు. వెనకబడినవర్గాలకు చెందిన బచ్చుల అర్జునుడిని, గన్నవరం టీడీపీ ఇన్‌చార్జీగా అపాయింట్ చేసి, కులాల సమీకరణను పక్కాగా ఫాలో అయ్యారు. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ సంఖ్యలో వున్నారు కాబట్టి, అదే వర్గం నుంచి వచ్చిన బచ్చుల అర్జునుడు అయితేనే, పోటీ టగ్ ఆఫ్ వార్‌గా వుంటుందన్నది బాబుగారి స్ట్రాటజీ. అయితే, టీడీపీ క్యాడర్ ఆలోచన మాత్రం మరోలా వుంది.
బచ్చుల అర్జునుడు బీసీ నేత అయినప్పటికీ, వల్లభనేని వంశీకి మాస్‌లీడర్‌గా గుర్తింపు వుందని, ఇది ఓట్ల లెక్కను తారుమారు చేస్తుందని తెలుగు తమ్ముళ్లు బేరీజు వేసుకుంటున్నారట. వైసీపీ అధికారంలో వుండటం, వంశీ పాపులర్ లీడర్ కావడం, టీడీపీ అభ్యర్థికి మైనస్‌గా పరిణమించడం ఖాయమని భావిస్తున్నారట. ఆచితూచి అడుగులు వెయ్యాలని, గన్నవరంలో వంశీకి దీటుగా బదులిచ్చే నేతను బలపర్చాలని కోరుకుంటున్నారట క్యాడర్. అయితే, చంద్రబాబు మాత్రం, సామాజిక సమీకరణలే గెలిపిస్తాయన్న పట్టుదలతో వున్నారట. చూడాలి, గన్నవరం బైపోల్ ఎప్పుడు జరుగుతుందో, ఎవరి వ్యూహాలు ఎలా పని చేస్తాయో.