తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా? జనసేన పోటీ చేస్తుందా? అనే విషయం పవన్ హస్తిన టూర్ అనంతరం క్లారిటీ రానుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా బరి నుండి వైదొలిగిన జనసేన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన ప్రకటించడం తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపి జనసేనను ఎన్నికల బరి నుండి ఉపసంహరింప చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయానికి వచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించినందునా అందుకు ప్రతిఫలంగా తిరుపతి ఉపఎన్నిక సీటును జనసేనకే కేటాయించాలని పవన్ కోరబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల రీత్యా తిరుపతి ఎంపీ సీటును జనసేనకే ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన పవన్ తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరికొంతమంది బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తిరుపతి సీటును వదులుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తిరుపతి సమగ్రమైన అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరిగాయన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తిరుపతి విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ల రూపురేఖలు కేంద్రం నిధులతో మారాయన్నారు. స్మార్ట్ సిటీ పనులు కేంద్రం నిధులతో పరుగులు పెడుతున్నాయన్నారు. తాము చేసిన అభివృద్ధి మంత్రంతో తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఉపఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థి ఎవరు పోటీ చేయాలా అన్న విషయంపై చర్చలు జరుపుతున్నామని, పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చిస్తున్నారని తెలిపిన ఆయన మోడీ చరిష్మా, గ్లామర్ తిరుపతిలో బీజేపీ విజయానికి దోహదపడుతుందని అన్నారు. ఇది ఇలా ఉంటే ఒకవేళ తిరుపతి ఎంపీ సీటు జనసేనకు కన్ఫామ్ కాకపోతే పవన్‌కల్యాణ్ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.