వైజాగ్ వార్‌తో ఇమేజ్ ఎవరికి..డ్యామేజ్ ఎవరికి?
అప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు. ప్లేస్ ఒకటే, లీడర్స్ డిఫరెంట్. అప్పుడూ ఇప్పుడూ, విశాఖ విమానాశ్రయం యుద్ధక్షేత్రాన్ని తలపించింది.
అప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు. ప్లేస్ ఒకటే, లీడర్స్ డిఫరెంట్. అప్పుడూ ఇప్పుడూ, విశాఖ విమానాశ్రయం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కానీ ఇప్పుడు బాబు దిగ్భంధనాన్ని, వైసీపీ, టీడీపీ భిన్న కోణాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నాయి. ఇంతకీ వైజాగ్ ఘటనతో అధికార, ప్రతిపక్షాలు ఆశిస్తున్నదేంటి?
నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ను, వైజాగ్‌లో పోలీసులు అడ్డుకున్నారు. నేడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునూ అడ్డుకున్నారు. నేటి ఘటనను అధికార పక్షం, ప్రతిపక్షం, ఏ కోణంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాయి? నేటి ఎయిర్‌పోర్ట్ ఉద్రిక్తతతో చంద్రబాబుకు మైలేజ్ వచ్చిందా? వైజాగ్‌లో తన దిగ్భంధనంతో చంద్రబాబు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవడాన్ని, వైసీపీ ఎందుకంత హ్యాపీగా ఫీలవుతోంది?
ఊహించినట్టుగానే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు విశాఖ పర్యటన, యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే, భారీ సంఖ్యలో జనం ఆయనను అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడాన్ని వైసీపీ శ్రేణులు సమర్థించుకుంటుంటే, ఆ ఘటనకు దీనికి పోలికేలేదని టీడీపీ శ‌్రేణులు తిప్పికొడుతున్నాయి. మరి నిజంగా నాటి ఘటనకు, నేటి ఘటనకు అసలు పొంతనే లేదా?
జనవరి 26, 2017. ప్రత్యేక హోదా కోసం విశాఖలో నిరసన చేయడానికి నాటి ప్రతిపక్ష నేత జగన్, ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేదని, ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఎయిర్‌పోర్టు రన్‌వే పరిసరాల్లోనే దీక్షకు కూర్చున్నారు జగన్. రాష్ట్రానికి హోదా కోసం పోరాడుతుంటే, చంద్రబాబు ప్రభుత్వమే స్వయంగా అడ్డుకుందన్న అంశాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎంతోకొంత సానుభూతి పొందడంలో సఫలమయ్యామన్నది వైసీపీ భావన. ఇప్పుడు చంద్రబాబు పర్యటన కూడా, అదే జగన్ పర్యటనను తలపించింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మరి నాడు వైసీపీ సానుభూతి పొందితే, నేడు చంద్రబాబుకూ అదే సానుభూతి లభిస్తుందా? ఈ ఘటనతో చంద్రబాబు ఆశిస్తున్నదేంటి?
అయితే, నాడు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయడానికి వెళ్లిన జగన్‌ను దిగ్భంధనం చేశారు చంద్రబాబు. అదే చంద్రబాబు ఇప్పడు ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ రెండింటిలో చాలా తేడా వుంది. నాడు హోదా కోసం అరెస్టయి, జగన్ సింపతీ పొందారు. కానీ విశాఖను రాజధానిగా వ్యతిరేకించి, అదే విశాఖలో అడుగుపెట్టారు చంద్రబాబు. దీంతో సహజంగానే విశాఖలో వ్యతిరేకత వ్యక్తమైంది. టీడీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబును అడ్డుకున్నవారిలో వైసీపీ కార్యకర్తలుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ క్యాపిటల్‌గా సాగర నగరాన్ని వ్యతిరేకించి, అదే సిటీలో అడుగుపెట్టడం బాబుకు ఇబ్బంది అవుతుందని ముందు నుంచీ ఊహించిందే. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలే, విశాఖ రాజధానిగా వ్యతిరేకించలేక సతమతమయ్యారు. వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సైతం క్యాపిటల్ ప్రతిపాదనను సమర్థించారు.
అలా సమర్థించలేకపోతే, స్థానిక టీడీపీ నేతల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు సహజంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ నాడు వైఎస్ జగన్‌కు లభించిన సానుభూతి మాత్రం, నేడు చంద్రబాబుకు దక్కకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, మూడు రాజధానుల ప్రతిపాదనలతో, మూడు ప్రాంతాలూ, మూడు రకాలుగా స్పందిస్తున్నాయి. గుంటూరు, కృష్ణాలో చంద్రబాబుకు సింపతీ రావొచ్చేమో కానీ, ఉత్తరాంధ‌్ర, రాయలసీమల్లో మాత్రం, బాబు ఆశించిన సానుభూతి మాత్రం లభించదని, రాజకీయ పండితుల విశ్లేషణ.
సింపతీ విషయాలు పక్కనపెడితే, అధికార, విపక్షాలు మాత్రం రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, విశాఖలో చంద్రబాబు దిగ్భంధనాన్ని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. విశాఖను రాజధానిగా వ్యతిరేకించినందుకు, విశాఖ ప్రజలు చంద్రబాబును తిప్పి పంపారని, ప్రజాగ్రహంతో బాబు వెనుతిరగాల్సి వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, తనను అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యానికే మచ్చగా అభివర్ణిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకున్నే అడ్డుకుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వైజాగ్‌లో తనను అడ్డుకోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ ఘటనను ప్రయోగించాలనుకుంటున్నారు. ఓటమితో తీవ్ర నిరాశలో వున్న తెలుగు తమ్ముళ్లలో హుషారు నింపాలనుకుంటున్నారు. ఇలా చంద్రబాబును ప్రజలను తిప్పికొట్టారని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, సానుభూతిగా మలచుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారు. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది?