ఆలోచించే చెప్పారా.. ఒత్తిడి చేశారా.. విజయమ్మ రాజీనామా వెనుక వ్యూహాలేంటి..?
YS Vijayamma: వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వేళ.. ఓ తల్లి మనస్సు ఆవిష్కృతమైంది.
YS Vijayamma: వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వేళ.. ఓ తల్లి మనస్సు ఆవిష్కృతమైంది. ఎదిగిన బిడ్డను చూసి మురిసిపోతూనే ఎదగాల్సిన బిడ్డ గురించి ఆలోచించింది. పుత్రోత్సాహాన్ని అనుభవిస్తూనే పుత్రిక అభివృద్ధిని కాంక్షించింది. ఇద్దరిలో ఎవరివైపు ఉండాలో నిర్ణయించుకుంది. రెండు పడవల్లో అడుగులు వేయడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పింది. ఆమే వైఎస్ విజయమ్మ. అశేష జనసమూహం మధ్య వైసీపీకి దూరం కావాల్సిన సమయం వచ్చిందని విజయమ్మ ప్రకటించింది. అటు ప్రతిపక్షాలకు, ఇటు ప్రజల నుంచి వస్తున్న ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పి సగౌరవంగా పార్టీ నుంచి నిష్క్రమించింది.
వైఎస్ మరణం తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ విజయమ్మ తన కుమారుడు జగన్ ప్రతీ అడుగులో అడుగై నిలిచారు. దాదాపు 13 ఏళ్ల పాటు జరిగిన పరిణామాలు, వైసీపీ పార్టీ పుట్టుక వరకు ఆయన వెన్నంటే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ పాదయాత్ర చేసిన సమయంలోనూ ఆయన వెన్నంటే నడిచారు. వైసీపీ గౌరవాధ్యక్ష హోదాలో సేవలు అందించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక కూడా జగన్ తోనే ఉన్నారు. అలాంటి విజయమ్మ వైసీపీ నుంచి దూరంగా జరుగుతున్నట్లు ప్రకటించారు. ఓ వైపు ఘనంగా వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వేళ మరోవైపు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చిన సమయాన తన భర్త జయంతి రోజున విజయమ్మ చేసిన ప్రకటన ఆ పార్టీలో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్లీనరీలో విజయమ్మ ప్రసంగం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా స్పష్టంగా ఓ రాజకీయ నాయకుడి వలే అన్ని ప్రశ్నలకు సమాధానాలు వివరిస్తూ ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం అయ్యే వరకు వెన్నంటి ఉన్న ప్రజలను కొనియాడారు. గతంలో ఆమె మాట్లాడిన మాటలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన కుమారుడిని మీ చేతుల్లోనే పెట్టానని ప్రస్తుతం సీఎం చేసింది మీరే అంటూ పార్టీ శ్రేణులపై ప్రేమను కురిపించారు. ఈ సందర్భంగా తన ప్రయాణం ఎలా ఉండబోతుంది..? గతంలో ఎలా సాగిందంటూ వివరిస్తూ తన స్పీచ్ లోకి తన కూతురు షర్మిలను తీసుకొచ్చారు. తండ్రి ఆశయాలను నెరవేర్చే క్రమంలో ఏపీలో ఎలాగైతే జగన్ పాలన సాగిస్తున్నారో తెలంగాణలో తన కూతురు షర్మిల కూడా అదే విధంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. గతంలో అన్నకు తోడుగా ఉందని జగనన్న వదిలిన బాణంగా ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్రను వివరించారు.
ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అంటూ మాట్లాడిన విజయమ్మ తాను ఎటువైపో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏపీలో జగన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడని తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే ఇదే సమయంలో కొందరు చేస్తున్న విమర్శలను విజయమ్మ గుర్తు చేశారు. ఒకేసారి రెండు పార్టీలో ఉండటంపై తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన లేఖను ప్రస్తావిస్తూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండవచ్చా లేదా అనే కథనాలపై స్పందించారు. కూతురు, కుమారుడు ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు ప్రయోజనాల కోసం కష్టపడుతున్నారని ఈ సమయంలో తాను ఎటువైపు ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని గద్గద స్వరంతో చెప్పుకొచ్చారు.
జగన్ మరోసారి అధికారంలోకి వస్తాడని ఆ నమ్మకం తనకుందని ప్లీనరీ వేదికగా విజయమ్మ ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ కోడలిగా అక్కడి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన కూతురు షర్మిల ఇప్పుడిప్పుడే ఎదుగుతుందని ఆమెకు తోడుండాల్సిన అవసరం వచ్చిందన్నారు. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు రానున్న నేపథ్యంలో షర్మిల వెంటే నడవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇద్దరికీ తల్లినే అంటూ ఇద్దరి అభివృద్ధిని కోరుకోవాలనే ఉద్దేశ్యంతోనే తన రాజీనామా అంటూ కామెంట్స్ చేశారు.
అయితే అంతటితోనే ఆగకుండా తన నిర్ణయాన్ని అర్దం చేసుకోవాలని తనను క్షమించాలంటూ ప్రజలను, పార్టీ శ్రేణులను విజయమ్మ కోరడం ఆమెలోని పరిపక్వతను గుర్తు చేసింది. కష్టాల్లో ఉన్న కుమార్తెను ఒంటరిగా వదిలేయడం సరికాదనేదే తన అభిప్రాయమని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తన రాజీనామాతో భవిష్యత్తులో జగన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవనే సంకేతాలిచ్చారు. అదీ కాకుండా తన అవసరం ఎప్పుడు కావాల్సి వచ్చినా జగన్ కు అండగా ఉండేందుకు సదా సిద్ధమని అదే ప్లీనరీ వేదిక నుంచి ప్రకటన చేయడంతో ఆమె తీసుకున్న నిర్ణయం అందరూ ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడేలా చేసిందని చెబుతున్నారు.
అయితే విజయమ్మ రాజీనామా ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనే ఆమె రాజీనామా చేయాలని అనుకున్నా జగన్ మాట వల్లే ఆమె ప్లీనరీ వేదికగా ఈ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఇటు అమ్మ రాజీనామా చేయడమే పార్టీకి మంచిదనే భావన జగన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. లేకపోతే విపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు విపక్షాలు కూడా విజయమ్మ రాజీనామాపై తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. పక్కా వ్యూహంతోనే తల్లిని పార్టీ నుంచి బయటకు పంపించివేశారని ఆరోపిస్తున్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నుకోవడం అదే సమయంలో విజయమ్మ రాజీనామా చేయడం చూస్తే ఇది ప్రణాళికాబద్దంగా జరిగిన వ్యవహారమే అని చెప్పుకొస్తున్నారు.
మరోవైపు విజయమ్మ రాజీనామాపై ఆమె కూతురు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించేందుకు నిరాకరించారు. ఈ విషయంపై ఆమె స్పందించేందుకు ఇష్టపడలేదు. వైసీపీ నుంచి విజయమ్మ బయటకు వెళ్లడంపై రాజకీయాలు ఎలా ఉన్నా ఆమె తీసుకున్న నిర్ణయం మానవత్వ కోణంలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఎదిగిన కొడుకు దగ్గర కంటే కష్టపడుతున్న కూతురు దగ్గరే ఉండాలన్న ఆమె ప్రకటన సాటి తల్లులు కొనియాడుతున్నారు.