Water Dispute between Telugu States: భేటీ తరువాతే ముందుకు.. తెలుగు రాష్ట్రాలకు తేల్చి చెప్పిన కేంద్రం
Water Dispute for Telugu States: ఇటీవల నీటి పారుదల ప్రాజెక్టులను విస్తరించే విషయంలో తలెత్తిన విభేదాలను తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు భేటీ
Water Dispute for Telugu States: ఇటీవల నీటి పారుదల ప్రాజెక్టులను విస్తరించే విషయంలో తలెత్తిన విభేదాలను తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు భేటీతో పరిష్కరించుకుని ముందుకు సాగాలని కేంద్రం ఆదేశించింది. తరువాతే ప్రాజెక్టుల విస్తరణపై ముందుకెళ్లాలని సూచించింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు రాసిన లేఖలకు కేంద్రం స్పందించింది. వీలైనంత తొందరలో భేటీ పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులపై ఈ నెలలో నిర్వహించే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వివాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకూ అనుమతులు తీసుకోవాలని లేఖలో తెలంగాణకు తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి... రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏపీకి సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని కోరినా స్పందించలేదని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎజెండాను పంపలేదని గుర్తు చేశారు.
కాళేశ్వరం సహా ఏడు ప్రాజెక్టులు ఆపేయండి
గోదావరిపై అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. 'అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కాళ్వేరం, గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీలు, రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు పథకాలు చేపట్టిందని, వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని మే 14న గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ జూన్ 2018లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది.
కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలిస్తున్నారని, వాటికి ఆమోదం లేదనే అంశాన్ని తెలంగాణ సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. కొత్త పనులకు కేంద్ర అనుమతులు తీసుకోవాలి'అని షెకావత్ సూచించారు.'విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపట్టిన ఏడు ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ మే 30న గోదావరి బోర్డు లేఖ రాసింది. జూన్ 5న నిర్వహించిన గోదావరి బోర్డు 9వ సమావేశంలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా అందజేయాలని.. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని స్పష్టం చేసింది. డీపీఆర్‌లు పంపాలని జూన్ 10న మరోసారి గోదావరి బోర్డు గుర్తుచేసింది. కానీ ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు'అని షెకావత్ పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోకుండా, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల పనులను చేపట్టవద్దంటూ తెలంగాణ సర్కార్‌ను షెకావత్ ఆదేశించారు.
'రాయలసీమ'టెండర్లు ఆపండి..
అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి రోజుకు 6–8 టీఎంసీలను తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, వాటి టెండర్లను ఆపాలని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆదేశించారు. 'రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తయితే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ మే 12న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణా బోర్డు... రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఇతర పనుల విషయంలో ముందుకెళ్లొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి మే 20న లేఖ రాసింది.
జూన్ 4న నిర్వహించిన బోర్డు సమావేశంలో కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని సూచించింది. కానీ ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు'అని షెకావత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ టెండర్‌పై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టొద్దన్నారు. ఇతర పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, వాటిని అప్పగించడం చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.