ఎల్జీ పాలిమర్స్‌లోని గ్యాస్ ట్యాంక్ పేలిపోవడంతో విషవాయువు చుట్టుముట్టింది. లీకైన గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించింది. విష వాయువును నియంత్రించడం వెంటనే సాధ్యం కాలేకపోయింది. పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. బిడ్డల కోసం తల్లడిల్లిన తల్లులు ఒకవైపు తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న పిల్లలు మరోవైపు ఇలా ఎవరిని కదిలించిన అంతులేని వేదనే చెప్పలేని రోదనే. మరి దీనికంతటికి కారణం ఒకే ఒక్కటి. అదే స్టైరిన్.? అసలు ఏంటీ స్టైరిన్? దాని ప్రభావం ఏంటి?
స్టైరిన్. అత్యంత ప్రమాదకరమైన రసాయనం. పాలిస్టిరిన్ ఉత్పత్తికి ఉపయోగపడే ఈ రసాయనాన్ని ఒక ముడిసరుకుగా వాడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక రసాయనాల సమ్మేళనం. దీని రసాయన నామం C8H8. ఈ స్టిరిన్‌ను వినైల్ బెంజిన్, ఇథనైల్ బెంజిన్, పినైలిథలిన్ రసాయనిక చర్య జరిపి కృత్రిమంగా సృష్టిస్తారు. బెంజిన్ నుంచి ఉత్పన్నమైన స్టిరిన్‌కు రంగు ఉండదు. ద్రవస్థితిలో నూనెల కనిపించే ఈ ప్రమాదకర రసాయనం. కొన్ని సందర్భాల్లో ఇది పసుపురంగంలోనూ ఉంటుంది.
ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. తీయటి వాసన ఉండే ఈ గ్యాస్ లీకైన క్షణాల్లోనే మనుషులపై, పశుపక్ష్యాదులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెంటనే బాధితుడికి చికిత్స అందకపోతే ప్రాణాలను కూడా పోతాయి. గ్యాస్‌ను పీల్చగానే క్షణాల్లో చర్మంపై దద్దుర్లు పుడతాయి. కంటిచూపు మందగిస్తుంది. తలనొప్పి, కడుపులో వికారానికి దారి తీస్తుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమై బాధితుడు ఉక్కిరిబిక్కిరై పోతాడు. ఊపిరి అందక విలవిలలాడిపోతాడు.
స్టైరన్ గ్యాస్ పశు పక్ష్యాదులను వదిలిపెట్టదు. గ్యాస్ లీకైన ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారిపోతాయి. మిగిలిన గ్యాస్ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. ఈ ప్రమాదం జరిగిన చోట ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. ఈ గ్యాస్ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. గతంలో కూడా ఎల్‌జి పాలిమర్స్‌లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టింది. కానీ ఈసారి లాక్‌డౌన్ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులు జరగకపోవడంతో స్టైరిన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.