Vidadala Rajini: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ భారీ తేడాతో ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎదగడానికి ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటీకే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి బయటకొచ్చారు. తాజాగా విడుదల రజిని సైతం వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ఆ ఎన్నికల్లో వైసీపీకీ 40 శాతం ఓట్ షేరింగ్ లభించింది. ఈ క్రమంలోనే తమ పార్టీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆళ్ల నాని, బాలినేని, సామినేని, మోపిదేవి, బీదా మస్తానరావు వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అలాగే విడదల రజినీ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా రజని పార్టీలో యాక్టివ్‌గా కనిపించారు. గతంలో ఆమె నిత్యం జగన్ వెంట కనిపించేవారు. అంతేకాదు మీడియాలో సమావేశాల్లో సైతం తన వాయిస్‌ని వినిపించేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆమె సైలెంట్ అయ్యారు. దీనికి కారణం ఆమె జనసేనలో చేరనున్నట్లు వస్తున్న వార్తలే కారణమై ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. రజని భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. రజిని పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఆమె వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని సమాచారం.
2014 ఎన్నికల సమయంలో విడుదల రజిని ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆమె రాజకీయ ప్రస్తానం మొదలైంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయారు. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్ లో జరిగిన మహానాడులో రజినీతో మాట్లాడించారు. అందులో విడుదల రజిని తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. ఇలా ఓ వైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.
తెలుగు దేశం పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ప్రత్తిపాటి పుల్లారావుపై 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజినికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించింది. 2022 ఏప్రిల్ 11న జగన్ మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రజిని. ఈ నేపథ్యంలో ఆమె జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, విడదల రజిని పార్టీ మార్పుపై ఆమె అనుచరవర్గం స్పందించింది. విడుదల రజిని వైసీపీని వీడే ప్రసక్తే లేదని.. ఆమె పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. విడుదల రజినికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్‌ను కాదని ఆమె బయటకు వెళ్లరని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇంతకీ విడదల రజినీ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతారా? లేదంటే రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ వెంటే నడుస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.