ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి విజయం
Venkata Rami Reddy: 296 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వెంకట్రామిరెడ్డి
Venkata Rami Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 296 ఓట్ల మెజారిటీతో వెంకట్రామిరెడ్డి గెలిచారు. వెంకట్రామిరెడ్డి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా గెలుపొందారు. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా ప్రత్యర్ధి రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంత శాతం ఓట్లు వెంకట్రామరెడ్డి పొందారు. మొత్తం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. ప్రత్యర్థి రామకృష్ణ, ప్యానెల్ చిత్తుగా ఓడిపోయింది.
మహిళ వైస్ ప్రెసిడెంట్ గా సత్య సులోచన 351 ఓట్లతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీకృష్ణ 478 ఓట్లతో గెలుపొందారు. వైస్ ప్రెసెడెంట్‌గా ఎర్రన్న యాదవ్ 478 ఓట్లు, అడిషనల్ సెకట్రరీగా గోపీకృష్ణ 692 ఓట్లు, మహిళా జాయింట్ సెక్రటరీగా ఆర్.రమాదేవి 402ఓట్లు, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ మనోహర్ 647 ఓట్లు, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి 404 ఓట్లు, కోశాధికారిగా కె.వెంకట్రావు 575 ఓట్లతో విజయం సాధించారు.
వెంకట్రామి రెడ్డి విజయంతో సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు చేసుకున్నారు. డిజే పాటలకు డాన్సులు వేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సచివాలయంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఉద్యోగులు నిజాయితీగా పని చేసే వారికే పట్టం కట్టారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి అన్నారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు వెంకట్రామిరెడ్డి.