Vasireddy Padma: 'వైఎస్ జగన్‌కు పార్టీ పట్ల, సమాజం పట్ల బాధ్యత లేదు... ' -వైసీపీకి గుడ్‌బై చెప్పిన వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు.

Update: 2024-10-23 10:29 GMT

Vasireddy Padma: 'వైఎస్ జగన్‌కు పార్టీ పట్ల, సమాజం పట్ల బాధ్యత లేదు... ' -వైసీపీకి గుడ్‌బై చెప్పిన వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరో షాక్ తలిగింది. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు వాసిరెడ్డి పద్మ. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్య పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అది దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆమె పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరించారు.

వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ తన రాజీనామా లేఖలో నేరుగా పార్టీ అధినేత జగన్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నడిపించడంలోనూ, పరిపాలన చేయడంలోనూ, సమాజం పట్ల జగన్ కు బాధ్యత లేదని విమర్శల దాడికి దిగారు పద్మ. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గుడ్ బుక్, ప్రమోషన్లు అంటున్నారని.. నాయకులు, కార్యకర్తలకు ఉండాల్సింది గుడ్ బుక్ కాదు, గుండె బుక్ అని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ప్రమోషన్ అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ అనేది వ్యాపార కంపెనీ కాదని వ్యాఖ్యానించారు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు.. గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్దపడుతున్నారని ఆమె తన లేఖలో గట్టిగానే విమర్శించారు.

పార్టీ కోసం కష్టపడిన తనకు.. వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందని.. ఆ అంశాలపై త్వరలోనే మాట్లాడతానన్నారు పద్మ. రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకోకుండా జగన్‌మోహన్ రెడ్డి పార్టీని నడపటం రాష్ట్రానికి ప్రమాదమన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని.. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా కలిసి పని చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, తమ ప్రభుత్వం ఉన్న కాలం మహిళలకు స్వర్ణయుగం అని వైసీపీ నేతలు చెబుతున్నారని, అయితే అప్పట్లో ముఖ్యమంత్రి, హోం మంత్రి ఎంత మంది బాధిత కుటుంబాల్ని కలిలి పరామర్శించారో తెలపాలని అన్నారు.

జగన్‌ను వ్యతిరేకించడం తప్ప మరో లక్ష్యం ఏమీ లేదన్నారు పద్మ. ప్రజలతో ఉంటానని.. రాజకీయాల్లో కొనసాగుతానని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రాజకీయ ముసుగులో జరిగే అన్యాయాలపై మాట్లాడతానని.. రాజకీయాల్లో ధైర్యం ఉండాలన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు జరిగినా, అన్యాయం జరిగినా.. పార్టీ మారడం మంచిది కాదని అన్నీ భరించి ఉన్నానన్నారు. కానీ నాయకుడి మీద నమ్మకం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు.

అయితే వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడటానికి కారణాలపై జోరుగానే చర్చ జరుగుతోంది. వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీటు ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో, నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇస్తారని ఆశించినట్లు తెలిసింది. కాగా, ఇటీవలే వైఎస్ జగన్ ఆ పదవికి తన్నీరు నాగేశ్వరరావును ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేయడం.. రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పడంతో ఆమె ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనే చర్చ జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాసిరెడ్డి పద్మ, ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆమె 2012లో వైసీపీలో చేరారు. తాజాగా ఆమె వైసీపీకి రాజీనామా చేయడంతో త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News