Ugadi 2021: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు, పంచాంగాలతో సందడి
Ugadi 2021: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్బంగా తెలంగాణ దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించింది.
Ugadi 2021: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్బంగా తెలంగాణ దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది తెలంగాణలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. మే తర్వాత కోవిడ్ నుంచి ఉపశమనం పొందుతారని ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని సోమయాజుల శాస్త్రి తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ఆకాంక్షించారు.