Ugadi 2021: ఉత్తమ ప్రతిభ కనపర్చిన పోలీసు లకు ఉగాది పురస్కారాలు
Ugadi 2021: విధుల్లో ఉత్తమ పనితీరు, ప్రతిభ కనబరిచిన వారికి పోలీసులకు ఏపీ సర్కార్ ఉగాది పురస్కారాలు ప్రకటించింది.
Ugadi 2021: విధుల్లో ఉత్తమ పనితీరు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2020, 2021 ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) కుమార్ విశ్వజిత్ సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర పోలీస్, ఫైర్ సర్వీసెస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను పోలీసులకు అందజేయనున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉగాది పర్వదినం వేళ 583 మందికి పతకాలు ప్రకటించింది ప్రభుత్వం.
పోలీసులు ఎంతో గర్వంగా భావించే.. ఉత్తమ సేవ, కఠిన సేవ, ముఖ్యమంత్రి సేవ, మహోన్నత సేవ పురస్కారాలు పొందిన వారి జాబితాను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే.. రెండేళ్ల క్రితం గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం, విజయవాడ బందరు కాల్వలో పడిపోయిన బాలికను రక్షించిన ఆర్ఎస్ఐ అర్జునరావులకు ఏపీ సర్కార్ తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శౌర్య పతకాలు అందించనున్నారు.
ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రత్యేకంగా ప్రకటించగా, మరో నాలుగు విభాగాల్లో పతకాలను ఇవ్వనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున, ఒకేసారి రూ.10 వేల నగదు అందిస్తారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ మహోన్నత సేవా పతకం కింద నెలకు రూ.125, ఒకేసారి రూ.6 వేల నగదు అవార్డుగా ఇస్తారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.5 వేల నగదు పారితోషకాన్ని అందిస్తారు. ఏపీ పోలీస్ కఠిన సేవా పతకానికి ఎంపికైన వారికి నెలకు రూ.100, ఒకేసారి రూ.4 వేల నగదు అందిస్తారు. ఏపీ పోలీస్, ఫైర్ సర్వీసెస్ సేవా పతకం కింద నెలకు రూ.75, ఒకేసారి రూ.4 వేలు ఇస్తారు.