Tungabhadra Pushkaralu 2020: మంత్రాలయంలో ప్రారంభం అయిన తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాల సందడి ప్రారంభం అయింది. మంత్రాలయంలో పుష్కరాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.
తుంగభద్ర పుష్కరాల సందడి ప్రారంభం అయింది. మంత్రాలయంలో పుష్కరాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈరోజు (శుక్రవారం 20 నవంబర్) మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు వీఐపీ ఘాట్‌లో తుంగభద్ర పుష్కరిణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుణ్యనదుల జలాలను తుంగభద్రలో కలిపి, బృహస్పతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పీఠాధిపతి, పూజారులు, భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలాచరించారు. ఇవాళ్టి నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే.
రాఘవేంద్ర స్వామి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..
తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని వచ్చే భక్తుల దర్శనార్ధం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 రెండు గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉచిత దర్శనాలు ఉంటాయి. ఒకవేళ భక్తుల సంఖ్యా పెరిగితే కనుక మరో గంట అదనంగా దర్శనాన్ని కల్పించేందుకు ఆలోచన చేస్తున్నారు. దర్శనాల కోసం అదనంగా వరసలు, వీఐపీల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు పరిస్థితులను బట్టి ప్రత్యేక గేటు ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. 12 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం దర్శనాలు, పరిమళ ప్రసాదాలు, అన్నదానం తదితర ఏర్పాట్లను పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.