విదేశాల్లో టీటీడీ.. ఖండాలు దాటుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం...
TTD: పాలకమండలితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న టీటీడీ...
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం ఖండాలు దాటుతోంది. ఎన్ఆర్ఐలు సైతం విదేశాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలంటూ టీటీడీని అభ్యర్థిస్తున్నారు. స్వామిపై గల అపార భక్తితో విదేశాలలో సైతం భక్తులు తమ ఆస్తులను కానుకలుగా సమర్పిస్తున్నారు. మొట్టమొదటి సారిగా తిరుమల తిరుపతి దేవస్థానంకు విదేశాల నుంచి భూమి విరాళం ఇచ్చేందుకు ఓ భక్తుడు ముందుకొచ్చారు.
సీషెల్స్‌లో శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రవాస భారతీయుడు రామకృష్ణ పిళ్ళై టీటీడీని కోరారు. సీషెల్స్ రాజధాని అయిన విక్టోరియాలో నివాసం ఉంటున్న ఆయన అక్కడ భూమిని కేటాయించేందుకు సిద్ధమయ్యారు. సీషెల్స్‌లో అత్యధికంగా హిందువులు ఉంటున్నారని తెలిపిన పిళ్ళై ఇప్పటికే అక్కడ అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయాలను నిర్మించినట్లు వెల్లడించారు. కోటి విలువ చేసే 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇప్పటి వరకు టీటీడీకి భారత దేశంలో మాత్రమే భూములు ఉన్నాయని తెలిపిన టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఓవర్ సీస్‌లో విరాళం స్వీకరణపై టీటీడీ పూర్థిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాత కోరిన కోరిక మేరకు విక్టోరియాలో ఆలయ నిర్మాణంపై టీటీడీ పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతికి భారత దేశం నుంచి మాత్రమే విరాళాలు స్వీకరించిన టీటీడీ ప్రవాసాంధ్రుడి కోరిక మేరకు విదేశాల్లో ఆలయం నిర్మిస్తుందా ? విదేశీ భక్తుడి అభ్యర్థనను టీటీడీ ఒప్పుకొంటుందా ? సీషెల్స్‌లో ఆలయ నిర్మాణంపై టీటీడీ ఏ నిర్ణయం తీసుకోనుంది ? తెలియాలంటే వేచి చూడాల్సిందే.