ఉగాది నుంచి శ్రీవారి అర్జిత సేవలు.. టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్: వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా 2 వేల 937.82 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయించింది. అలాగే ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు అందిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే కళ్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు రూపకల్పన చేశామని, ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని అధికారులను పాలక మండలి ఆదేశించింది.
మరోవైపు తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ అందించాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ వేద పాఠశాల పేరు మార్పు శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా నామకరణం చేసిన పాలక మండలి వేద పాఠశాలలోని అద్యాపకులకు వేతనం 22 వేల నుంచి 35 వేల 150 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక తిరుమలలోని వసతి గృహాలకు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన పాలక మండలి గ్రీన్ పవర్ ప్రాజెక్టుకు ప్రతిపాదన తెచ్చింది. అటు అయోధ్యలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయించాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోరుతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.