TTD: వెనుకబడిన ప్రాంతాల భక్తులకు టీటీడీ శుభవార్త
TTD: టీటీడీ ఆలయాలు నిర్మించిన జిల్లాల్లోని భక్తులకు అవకాశం
TTD: జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులను బస్సుల్లో ఉచితంగా తీసుకొచ్చి శ్రీవారి దర్శనం చేయించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 500 నుంచి 1000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం విధివిధానాలు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే, బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి కాలికనడక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయించారు. ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ, 7న ధ్వజారోహణం, 11న గరుడ వాహన సేవ, 12న స్వర్ణరథం, 14న రథోత్సవం, 15న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. కాగా, అక్టోబరుకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, 24న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేస్తారని సమాచారం.