Tirupati: తిరుమల భక్తులపై టీటీడీ కరోనా ఆంక్షలు
Tirupati: జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దు-టీటీడీ
Tirupati: తిరుమల భక్తులపై టీటీడీ కరోనా ఆంక్షలు విధించింది. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలకు 45వేల మందికే ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడం మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడంతో టీటీడీ సందిగ్ధంలో పడింది. ఇప్పటికే తిరుమలలో పదుల సంఖ్యలో కేసులు నమోదుకావడంతో పరిస్థితులను బట్టి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు. ఇక గంటకు ముందు టైంస్లాట్ భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోకి రావాలని తెలిపారు.
ఇక శ్రీవారి దర్శనానికి బుధవారం నుంచి 15వేల టైంస్లాట్ టోకెన్లు మాత్రమే ఇస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి. అదేవిధంగా అన్ని రకాల దర్శనాలకు 45వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడతామని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న భక్తులు తిరుమలకు రావొద్దని కోరారు. ఇక కేసులు తీవ్రమైతే శ్రీఘ్ర దర్శనం టికెట్లు రద్దు చేసి వాటిని మే, జూన్‌కు రీషెడ్యూల్ చేస్తామన్నారు.