TTD Chairman YV Subba Reddy: ఏపీలో డిక్లరేషన్ వివాదం.. అలా అనలేదన్న చైర్మన్ సుబ్బారెడ్డి
TTD Chairman YV Subba Reddy | ఇటీవల కాలంలో తిరుమల, తిరుపతి దేవస్థానంకు సంబంధించి పలు అంశాల్లో రచ్చ జరుగుతోంది.
TTD Chairman YV Subba Reddy | ఇటీవల కాలంలో తిరుమల, తిరుపతి దేవస్థానంకు సంబంధించి పలు అంశాల్లో రచ్చ జరుగుతోంది. ఆలయ భూములు అమ్మక నిర్ణయం దగ్గర్నుంచి, డిక్లరేషన్ వరకు అన్నీ వివాదాలే చోటుచేసుకుంటున్నాయి. దీనిపై మరలా చైర్మన్ వివరణ ఇస్తేనే కాని, పరిస్థితి ఒక కొలిక్కి రావడం లేదు.. ఈ తరుణంలో రెండు రోజులుగా ఏపీలో చేలరేగుతున్న డిక్లరేషన్ వివాదానికి చైర్మన్ ఫుల్ స్ఠాప్ పెట్టారు. నేను అలా అనలేదని, కావాలనే మీడియా వక్రీకరించినట్టు పేర్కొన్నారు.
తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని ఎల్లో మీడియా తీరును విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా రోజూ వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భక్తులు వస్తారని.. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే తాను చెప్పాననన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని, డిక్లరేషన్ తీసేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, బురదజల్లాలని చూస్తున్న ప్రతిపక్షం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమలలో టీటీడీ డిక్లరేషన్ వివాదంపై శనివారం ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.
వాళ్లెవరూ డిక్లరేషన్ ఇవ్వలేదు
టీటీడీ చట్టంలోని రూల్ 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. ఇక స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతట తామే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు.
అంతేకాదు సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. అదే విధంగా, పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తిరుమల శ్రీవారి మీద మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు'' అని వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు.
ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా టీటీడీ ఆహ్వానం మేరకు, రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈనెల 23న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తున్న సీఎం జగన్‌ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలు ప్రచారం చేస్తోంది.