విశాఖ కేజీహెచ్‌లో బస్సు ప్రమాద బాధితులకు చికిత్స

* బాధితులను పరామర్శించిన మంత్రులు ఆళ్లనాని, అవంతి * నిన్న అరకు నుంచి హైదరాబాద్ వస్తుండగా లోయలో పడిన బస్సు * ప్రమాదంలో నలుగురు మృతి, 18 మందికి గాయాలు

Update: 2021-02-13 05:45 GMT

Representational Image

డ్రైవర్ నిర్లక్ష్యం ఆనందంగా గడపాల్సిన విహార యాత్రను విషాదంగా మలిచింది. నలుగురు ప్రాణాలను బలితీసుకుని వారి కుటుంబాలకు శోకాన్ని మిగిల్చింది. తమవారు కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తోన్న కుటుంబాల్లో విషాదఛాయలు అలిమాయి.

విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అరకు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారంతా రెప్పపాటులో జరిగిన ప్రమాదానికి కంగుతిన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే లోయలో 80 అడుగుల లోతుకు పడిపోయారు. దీంతో అనంతగిరి మండలం డముకు ప్రాంతం వారి ఆర్తనాదాలతో ఉద్విగ్నంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు బస్సులో ఉన్న వారిని బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. హుటాహుటిన వైజాగ్ కేజీహెచ్‌ వెళ్లి బాధితులను పరామర్శించారు హైదరాబాద్‌ షేక్ పేట ఆర్డీవో. అటు స్తానిక మంత్రులు అవంతి, ఆళ్ల నాని కేజీహెచ్‌ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురి మృతదేహాలకు కాసేపట్లో పోస్టు మార్టం చేయనున్నారు. ఆ తర్వాత డెడ్‌ బాడీలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. హైదరాబాద్‌కు మృతదేహాలు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. 

Tags:    

Similar News