ఏపీ పోలీస్ శాఖలో బదిలీల భయం.. అధికారుల ఒత్తిడి...
AP Police Department: బదిలీ వద్దంటూ కొంత మంది ఐపిఎస్ ల రిక్వెస్ట్...
AP Police Department: ఆంద్రప్రదేశ్ పోలీసు శాఖలో ఏ క్షణాన ఏ మార్పు జరుగుతుందో అంతుబట్టడం లేదు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు పోలీసు అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. మరికొంత మందికి స్థాన చలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బాసును ప్రసన్నం చేసుకునేందుకు పోలీస్ అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
దీనంతటికీ జిల్లాల విభజన ఒక కారణమైతే.. డిజీపీ ప్లానింగ్ మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో బదిలీ వేటు తప్పదని భావిస్తున్న అధికారులు పోలీస్ బాస్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. కొంత మంది ఐపీఎస్ లు ఈ మధ్యనే పదవుల్లో చేరినా.. మరికొంత మంది పదవీ కాలం రెండేళ్లు దాటింది. డిజిపీగా సవాంగ్ పదవీ బాధ్యతలు తీసుకున్నప్పుడే ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ఎస్ఐబిలోకి వచ్చారు. గంజాయి మాఫియాను అరికట్టడం, లిక్కర్ సీజ్ లో బ్రిజ్ లాల్ తనదైన ముద్ర వేశారు.
దీంతో ఆయన అదే పదవిలో కొనసాగుతారని ప్రచారం.. అయితే సవాంగ్ సమక్షంలో గంజాయి దహనంపై న్యాయపరమైన వివాదం ఉంది. ఈ కారణంగా బ్రిజ్ లాల్ సీటు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ సీపీ విజయవాడ కావాలని అడుగుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఇటీవల బదిలీపై వచ్చిన కాంతిరాణా టాటాపై బదిలీ వేటు పడుతుంది. కొంత మంది ఎస్పీలు కూడా నో ట్రాన్స్ ఫర్ రిక్వెస్టు లు పెడుతున్నట్లు సమాచారం.