Sankranti: పండక్కి ఊరెళుతున్నారా? అయితే రైళ్ళన్నీ ఫుల్
Sankranti: సంక్రాంతికి సొంతూరుకి వెళ్లాలనుకుంటున్నారా ఇంకా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోలేదా అయితే మీకు ఎదురుచూపులు తప్పవు.
Sankranti: సంక్రాంతికి సొంతూరుకి వెళ్లాలనుకుంటున్నారా ఇంకా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోలేదా అయితే మీకు ఎదురుచూపులు తప్పవు. ఎందుకంటే ఏపీకి వెళ్లే రైళ్లలో అన్ని రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. పైగా చాంతడంతా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఓపెన్ చేసి ఏ ట్రెయిన్ వెతికినా సింగిల్ సీట్ ఖాళీగా కనిపించడం లేదు. రెగ్యూలర్ ట్రెయిన్స్ ఫుల్ అయ్యాయి ఓకే మరి స్పెషల్ ట్రెయిన్స్ పరిస్థితి ఏంటి.? వాటిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు.
సంక్రాంతి రాగానే పట్టణం పల్లెకు పయనం అవుతుంది. సిటీలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు రైళో, బస్సో ఎక్కేసి సొంతూళ్లకు చెక్కేస్తారు. పండుగకు ఇంకా నెలన్నర టైం ఉంది. కానీ ప్రయాణికులంతా ఇప్పుడే అలెర్ట్ అయ్యారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్లే రైళ్లల్లో బుకింగ్ సీట్లన్నీ నిండిపోయాయి. ఏ రైలును చూసినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది.
జనవరి 9 నుంచే సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇక హాలీడేస్‌లో సొంతూల్లో ఉండాలని ఎవరూ కోరుకోరు. అందుకని నెలన్నర సమయం ఉండగానే బుకింగ్ చేసేసుకున్నారు. గోదావరి, గౌతమి, గరీబ్ రథ్ వంటి రెగ్యూలర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో కనిపిస్తోంది. ఫలక్‌నుమా, ఎల్‌టీటీ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లలో పరిమితి దాటి 'రిగ్రెట్'కు చేరింది.
గతేడాది కరోనా కారణంగా చాలామంది సొంతూళ్లకు వెళ్లలేదు. ఇప్పుడు కుటుంబసమేతంగా సొంతింటికి వెళ్లాలను ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో జనవరి 10 నుంచి 12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్ ఉంది. 13వ తేదీ కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు భారీగా ట్రెయిన్ టికెట్లను బుక్ చేసుకున్నారు. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు దొరకట్లేదు. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడంతో అటు నుంచి వచ్చే రైళ్లలోనూ రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
అయితే ఇప్పుడు అందరూ స్పెషల్ ట్రెయిన్స్ పై కన్నేసి ఉంచారు. రైల్వేశాఖ అనౌన్స్ చేసిన వెంటనే రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయాణికులు రెడీగా ఉన్నారు. ప్రతి సంక్రాంతికి రైల్వేశాఖ స్పెషల్ ట్రెయిన్స్ అరెంజ్ చేస్తుంది. ఈసారి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశముందు కాబట్టి స్పెషల్ రైళ్లను పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతికి నెలన్నర ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ ముందుగానే స్పెషల్ ట్రెయిన్స్ లిస్ట్ రిలీజ్ చేస్తే ప్రయాణికులకు ప్రయాణ టెన్షన్ తప్పేలా ఉంది.