Ramoji Rao: రామోజీరావు మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు
Ramoji Rao: రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Ramoji Rao: రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోజీరావు మరణవార్తతో దిగ్భ్రాంతి చెందామన్నారు గ్రామస్తులు. ఆయన కన్నుమూశారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు హైదరాబాద్ బయల్దేరారు. రామోజీరావు పెదపారుపూడిని దత్తత తీసుకుని 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవ చేశారని ఆయన సహాయాన్ని కొనియాడుతున్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెదపారుపూడిని మోడల్ విలేజ్‌గా డెవలప్ చేశారని అంటున్నారు. విద్యార్థి దశ నుండే రామోజీరావుకు కష్టపడి తత్వం ఉండేది అని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖర రావు గుర్తుచేసుకున్నారు. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్నా.. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారని కొనియాడారు చంద్రశేఖర్‌రావు.
కాగా రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తాత రామయ్య చనిపోయిన కొద్ది రోజులకే రామోజీరావు జన్మించారు. తాత రామయ్యపేరునే ఆయనకు పెట్టారు. అయితే, స్కూలుకు వెళ్లేటప్పుడు రామయ్య అనే పేరు నచ్చక రామోజీరావుగా స్వయంగా ఆయనే మార్చుకున్నారు. గుడివాడలో బీఎస్సీ పూర్తి చేసిన రామోజీరావు ఢిల్లీలోని ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరారు. మూడు సంవత్సరాలు అక్కడే పనిచేసి తరువాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.