శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. తిరు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం
Tirumala: ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు. విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల మధ్య ఊరేగింపుగా మాడవీధిలో ఉత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తరువాత యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీనినే సేనాధిపతి ఉత్సవం అని కూడా పిలుస్తారు.
అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇక మంగళవానం సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి, మొదటి వాహనంగా మంగళవారం రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారి మాడవీధుల్లో ఊరేగి భక్తులను కనువిందు చేయనున్నారు.