West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో అంబులెన్స్ మాయం

West Godavari: అంబులెన్స్‌ను విక్రయించిన పూళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి

Update: 2021-12-31 06:54 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో అంబులెన్స్ మాయం

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ దొంగతనానికి గురైంది. ఈ వ్యవహారంపై అరా తీసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో ఇంటి దొంగే దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడయింది. దీంతో ఒక్కసారిగా వైద్యశాఖ అధికారులు ఖంగుతున్నారు. అయితే అంబులన్స్‌ను విక్రయించిన వైద్యుడు వచ్చిన డబ్బులను ఆసుపత్రి అభివృద్ధి నిధికి జమచేశానని అంటున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లాలో 108 అంబులెన్స్‌ వాహనాన్ని ఓ వైద్యాధికారి నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూళ్ల పీహెచ్‌సీ ప్రాంగణంలో ఉంచిన అంబులెన్స్‌ గతేడాది ఏప్రిల్‌లో రోడ్డు ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతినడంతో స్ర్కాప్‌ కింద ఉంచారు. దీనికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు ఉంది. నిబంధనల ప్రకారం ఈ వాహనాలను తుక్కుగా నిర్ధారించాలంటే అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదించాలి. అప్పుడు వీటిని ఏలూరు డీఎంహెచ్‌వో ప్రధాన కార్యాలయానికి తరలించి, అనుమతులు వచ్చిన తర్వాత పత్రికా ప్రకటన ఇచ్చి వేలం వేయాలి. అయితే ఇవేమీ లేకుండా ఈ వాహనం పార్టులను బహిరంగంగా తరలించుకుపోయారని స్థానికులు అంటున్నారు.

Tags:    

Similar News