Andhra Pradesh: పట్టణాల కంటే పల్లెల్లోనే వైరస్‌ వేగంగా వ్యాప్తి

Andhra Pradesh: కరోనాతో తల్లడిల్లుతున్నపల్లెలు * పల్లెల్లోనూ భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు

Update: 2021-05-19 06:27 GMT

కరోనా ప్రతీకాత్మక చిత్రం 

Andhra Pradesh: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.... దాని ప్రభావం తగ్గడం లేదు. కరోనా ధాటికి ఏపీలోని పల్లెలు తల్లడిల్లుపోతున్నాయి. ఫస్ట్‌ వేవ్‌ పట్టణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే... సెకండ్‌ వేవ్‌ పల్లెల్ని కూడా చుట్టేస్తోంది. రోజురోజుకు పల్లెల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అసలే అరకొర వైద్య సదుపాయాలుండే పల్లె ప్రజలు కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. పల్లెల్లో మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏపీలో పట్టణాల కంటే పల్లెల్లోనే వేగంగా విస్తరిస్తోంది. రాకపోకలు పెరగడంతో వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. మొత్తంగా మే 2వ వారంలో 23.34 శాతం పాజిటివిటీ నమోదైంది. ఏప్రిల్‌ తొలివారంలో పట్టణాలు/నగరాల్లో 60% కేసులు నమోదయ్యాయి. పల్లెల్లో 40% వచ్చాయి. తాజాగా దీనికి భిన్నంగా పట్టణాల్లో 44శాతం, పల్లెల్లో 57% కేసులొచ్చాయి. రాకపోకలు పెరిగిపోతుండడంతో పల్లెల్లో వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది.

కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్‌ 1 నుంచి మే 16 వరకుచూస్తే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారంలో 38.79శాతం కేసుల నమోదుతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 10.98శాతం కేసులతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి 7వ తేదీ మధ్య రాష్ట్రంలో 2లక్షల19వేల 404 నమూనాలను పరీక్షించగా 5.14శాతం పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మే 8 నుంచి 16 మధ్య 8లక్షల 14వేల 435 నమూనాలను పరీక్షించగా 23.34శాతం పాజిటివిటీ రికార్డయింది.

రాష్ట్రంలోని చాలా పల్లెల్లో ప్రజలు కరోనా వైరస్‌ సోకినా ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. పట్టణాలకు చేరువలో ఉన్న వారైతే స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు వెళ్లిన మందులు తెచ్చుకుంటున్నారు. ఆస్పత్రుల్లో చేరగలిగే వారు చేరుతుండగా... అత్యధికులు ప్రమాదమైనప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. పట్టణాలకు సుదూరంగా ఉండే పల్లెల్లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. అక్కడ ప్రజలు కిలోమీటర్లు వెళ్లి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. వారికి హోం ఐసోలేషనే దిక్కుగా మారింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ పట్టణాల్లోనే అంతంత మాత్రంగా అమలవుతోంది. ఇక పల్లెల్లో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ రోజులకు, కర్ఫ్యూకు పెద్ద తేడా కనిపించడం లేదు. పల్లెల్లో హోం ఐసోలేషన్‌పై అవగాహన లేని వారూ పెద్దసంఖ్యలో ఉన్నారు. పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు కూడా బయట సాధారణ ప్రజల్లాగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి సులువుగా జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags:    

Similar News