కరోనాపై పోరాడి ఓడిన డాక్టర్..మరణం పెద్ద విషాదం.. అంతిమసంస్కారం అంతకుమించిన శోకం!

Update: 2020-04-16 08:08 GMT

బంధాలు... అనుబంధాలు... ఆప్తులు... ఆప్యాయతలు. ఆస్తులు... అంతస్తులు... పలుకుబడులు... పరిచయాలు...!! అన్నీ కనుమరుగు అవుతున్నాయ్‌.

మానవత్వాన్ని ఆవిరి చేస్తున్నాయ్‌!! ఇది... కరోనా మిగిల్చిన కన్నీటి కథ!! అన్నీ ఉన్నా అనాథను చేసిన విషాద వ్యథ!! కరోనా వైరస్‌పై పోరాడే ధీరుడిగా, ఆ రక్కసి బారిన పడ్డ బాధితులకు అండగా ఉంటున్న డాక్టర్‌ విషాదాంతమిది. దిక్కులేని చావుకు నిదర్శనమిది. నెల్లూరులో జరిగిన యధార్థ గాథను చెమర్చే కళ్లతో మనం చూద్దాం రండి.!!

ఇది కరోనా మిగిల్చిన విషాద కథ. కరోనాపై పోరాడి ఓడిన ఓ వైద్యుడి కన్నీటి గాథ. అందరూ ఉన్నా అంతిమ సంస్కారానికి నోచుకోని వ్యథ

నెల్లూరు నగరంలో జరిగిన ఈ ఘటనను తలుచుకుంటూ తెలుగు రాష్ట్రాలు కుమలిపోయాయ్‌. అయ్యో ఎంతటి దారుణం జరిగిపోయింది ఆ మాయదారి మహమ్మారి ఎంత కఠినంగా మార్చేసిందంటూ కన్నీరు కార్చాయ్‌. నెల్లూరులో ప్రముఖ ఆర్థోపెడిక్‌గా పేరొందిన ఓ వైద్యుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని అల్లాడిపోయాయ్‌. నెల్లూరులో పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఆస్తిపరుడు ఆర్ధిక స్థితిమంతుడు. అయినవాళ్లు ఎందరో బంధుత్వాలు ఎన్నో. అతని చేత్తో వైద్యం చేస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే మాయమవుతాయని నమ్ముతారు. ఆయన హస్తవాసికున్న ప్రత్యేకత అది. అలాంటి వైద్యుడిని కరోనా రక్కసి విడిచిపెట్టలేదు. కనికరం లేకుండా, అయిన వారు తోడు రాకుండా కాటికి పంపించేసింది.

పేరున్న డాక్టర్ కావ‌డంతో రోగుల‌తో ఎప్పుడూ ఆయ‌న క్లీనిక్ ర‌ద్దీగా ఉండేది. అలానే ఓ రోగి నుంచి ఆయ‌న‌కు క‌రోనా వ్యాపించింది. జ్వరం, జ‌లుబుతో బాధ‌ప‌డ్డారు. అయితే అవి క‌రోనా ల‌క్షణాల‌ని తెలుసుకోలేకపోయారు. మామూలు జ్వరమనుకొని తనకు తెలిసిన మందులు వాడారు. అయినా తగ్గలేదు సరికదా అంతకంతకూ మించుకుపోయింది. హుటాహుటిన నెల్లూరు నుంచి చెన్నై కార్పొరేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అక్కడ తుది శ్వాస విడిచారు. మరణమే ఒక విషాదమైతే అంతిమ సంస్కారం తీర‌ని శోకాన్ని మిగిల్చింది. క‌రోనాతో కన్నుమూయడంతో మృత‌దేహాన్ని నెల్లూరుకు తీసుకురావ‌డం వీలు కాలేదు. అందులోనూ డాక్టర్ భార్య, అన్న‌, అక్క‌, బావ‌ల‌కు అనుమానిత లక్షణాలు ఉండటంతో వాళ్లందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో భౌతికాయం చెన్నైలోనే ఉండిపోయింది. బంధువులు, స్నేహితులు, కావాల్సినంత సంపద‌ ఉన్నా చివరి రోజుల్లో అవేమీ అక్కరకు రాకుండా పోయాయ్‌. ఆయ‌న అంతిమ సంస్కార బాధ్యత‌ను పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులోని చెన్నై న‌గ‌ర‌పాల‌క సిబ్బంది చేప‌ట్టాల్సి వ‌చ్చిందంటే ఎంతటి దారుణమో చూడండి.

డాక్టర్‌ అంతిమక్రియలకు చెన్నై నగర పాలక సిబ్బంది దాదాపు యుద్ధం చేసినంత పనిచేశారు. తెలుగు వాళ్లు ఎక్కువ‌గా ఉన్న అంబ‌త్తూరు శ్మశాన వాటిక‌కు బ‌య‌ల్దేరారు. కానీ భాష‌, ప్రాంతం ఏవీ క‌రోనా ముందు ప‌ని చేయ‌లేదు. అక్కడి నుంచి పెరంబ‌దూర్ వెళ్లారు. అక్కడి ప్రజలు కొట్టినంత పని చేశారు. చివ‌రికి పోరూరు శ్మశానవాటిక‌లో చెన్నై నగర పాలక సిబ్బందే అన్నీ తామై ఆ డాక్టర్‌కు అంతిమక్రియ‌లు నిర్వహించారు. ఇంకో విషాదం ఏంటంటే ఆ అంతిమ సంస్కార ఘ‌ట్టాన్ని కుటుంబ స‌భ్యులు వీడియో కాల్‌లో చూస్తూ క‌న్నీరు కార్చడం తప్పించి ఏమీ చేయలేకపోవడం. నిస్సహాయులుగా మిగిలి పోయిన ద‌య‌నీయ స్థితిలోకి చేరుకోవడం. ఆస్తులు.. ఆర్థిక పరిస్థితులు.. బంధుగణం.. ఉన్నా కరోనా బారిన పడితే ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూడండి. చివరకు అయిన వారితో అంత్యక్రియలకు నోచుకోని దుస్థితి ఎదురైందంటే ఈ మహమ్మారి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో..!! ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.!!

Tags:    

Similar News