AP News: ఈ నెల 27నే ఎన్నికల ప్రచారాలు ప్రారంభించనున్న పార్టీలు
AP News: ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాలకు పార్టీలు సన్నద్ధం
AP News: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. మేము సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర... ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. మూడు పార్టీల నాయకులూ ఈ నెల 27నే ఎన్నికల ప్రచారానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు. సిద్ధం సభలతో ఇప్పటికే వైసీపీ నాయకులను ఎన్నికలకు సన్నద్ధం చేసిన వైఎస్ జగన్... బూత్ స్థాయిలోని కార్యకర్తలను సైతం ఎలక్షన్లకు రెడీ చేయనున్నారు. మేము సిద్ధం మా బూత్ సిద్ధం ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్ యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్లనున్నారు.
టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారయ్యాక ఈ నెల 17న ప్రజాగళం పేరుతో చిలకలూరిపేటలో సభ నిర్వహించారు. దానికి కొనసాగింపుగా ఈ నెల 27 నుంచి 31 వరకు సభలు, రోడ్ షోలు నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. రోజుకు 3 లేదా 4 నియోజకవర్గాల్లో పర్యటన సాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆయన పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి శ్రీకారం చుట్టనున్నారు. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని... పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం.