పోలవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
Polavaram: గట్టు తెగిపోయే ప్రమాదం ఉండటంతో అలర్ట్
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం ముంపు భయంతో గజగజ వణుకుతోంది. గోదావరి ఎగువనుంచి వస్తున్న వరద గంట గంటకూ పెరుగుతుండడంతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ద్వారా 20 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి పోటెత్తి ప్రవహిస్తుండడంతో దిగువకు భారీగా వరద వస్తోంది. అయితే పోలవరం గ్రామంలోకి నీరు రాకుండా రక్షణ కోసం నిర్మించిన నెక్లెస్ బండ్ పాత పోలవరం నుంచి గూటాల వరకు కోతకు గురవుతోంది. ఏ క్షణంలోనైనా గట్టు తెగిపోయే ప్రమాదం ఉండడంతో పాత పోలవరం, గుటాల గ్రామస్తులు ప్రాణాలు అరచేత పెట్టుకుని గడుపుతున్నారు.
రంగంలోకి దిగిన అధికారులు పోలవరం గ్రామాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరద ఉధృతికి నెక్లెస్ బండ్ గట్టు ఏ క్షణమైనా తెగిపోవచ్చని, ముందు జాగ్రత్తగా ప్రజలు గ్రామాలను ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.