ఇవాళ కార్తీక మాసం ఆఖరి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
* ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
Karthika Masam: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో అమరావతిలోని రామేశ్వేర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక పంచరామ క్షేత్ర సందర్శన బస్సులతో అమరావతి వీధులు నిండిపోయాయి.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. ఆఖరి సోమవారం కావడంతో స్వామి,అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగ దగ్గర పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు, ఆలయ ఉత్తర భాగాన కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. మరోవైపు ఆలయంలోని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు ఆలయ అర్చకులు. అటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి వత్రాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.