టీడీపీలో ఎంపీ టిక్కెట్ ఇస్తామన్నా వైసీపీలోకి జంప్ అయ్యారా..

Update: 2019-03-03 14:32 GMT

ఎన్నికలకు మహా అయితే ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఈలోపే ఏపీలోని వివిధ పార్టీలు వలసలను ప్రోత్సాహిస్తున్నాయి. గెలుపుగుర్రాలకే ప్రధాన పార్టీలు టిక్కెట్లు కన్ఫామ్ చేస్తున్నాయి. గతేడాది టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు అనూహ్యంగా ఇవాళ(ఆదివారం) జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నిజానికి 2014 ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరారు. అయితే అక్కడ రెండు నెలలు గడవకముందే జగన్ తో విభేదించి బీజేపీలో చేరిపోయారు. నరసాపురం ఎంపీ టిక్కెట్ ఆశించారు. కానీ ఆయన సమీప బంధువు గోకరాజు గంగరాజుకు కట్టబెట్టింది బీజేపీ. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం సైలెంట్ గా ఉన్న ఆయన గతేడాది టీడీపీలో చేరారు. దాంతో ఆయనకు నరసాపురం పార్లమెంటు బాధ్యతలు అప్పజెప్పింది టీడీపీ అధిష్టానం.

అయితే ఏమైందో ఏమో వారం రోజుల నుంచి తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సరిగ్గా వారం కిందట ఆయన వైసీపీలో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఆయన ఆ ప్రచారాన్ని కూడా ఖండించారు. ఇంతలో ఆదివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోవడం టీడీపీ నేతల్ని నివ్వెరపాటుకు గురిచేసింది. నరసాపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ బలంగా ఉంది, పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆయనకే అని స్పష్టమైన హామీ ఉండగా.. వైసీపీలో చేరడం ఏంటని ఆరాతీస్తున్నారు. కాగా వైసీపీ లో చేరిన ఆయనకు నరసాపురం ఎంపీ టిక్కెట్ కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. 

Similar News