Off The Record: ఫ్యాన్ కిందికి ఎందుకొచ్చామా అని... ఈ నలుగురు తెగ ఫీలవుతున్నారట!
Off The Record: ఎంచక్కా సైకిల్ ఎక్కి తిరిగే నలుగురు ఎమ్మెల్యేలు ఫ్యాన్ కిందికి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు ఫీలవుతున్నారట.
Off The Record: ఎంచక్కా సైకిల్ ఎక్కి తిరిగే నలుగురు ఎమ్మెల్యేలు ఫ్యాన్ కిందికి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు ఫీలవుతున్నారట. స్థానిక వైసీపీ నేతల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఉక్కపోతకు గురవుతున్నారట. తెలుగుదేశంలో గెలిచి, ఫ్యాన్ కింద సేద తీరుదామని వస్తే అసలు సమస్య ఇక్కడే మొదలైందని బాధపడుతున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చాం కాబట్టి ఇక హవా అంతా మనదేనని అనుకుంటే, సీన్ రివర్స్ అయిందని తెగ కుమిలిపోతున్నారట. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఎందుకంత కుమిలిపోతున్నారు?
వల్లభనేని వంశీ. గన్నవరం ఎమ్మెల్యే. మద్దాలి గిరి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. కరణం బలరామ్, చీరాల ఎమ్మెల్యే. వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా... ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించే. వైసీపీ వార్‌ఫీల్డ్‌లో కొన్ని ఈక్వేషన్స్ ఈ ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయట. ప్రజాబలంతో గెలిచిన తమకు పవర్ ఉన్నా ఫ్యాన్ కింద సేద తీరుదామంటే, స్విచ్ సరిగ్గా పని చేయడం లేదని ఫీలవుతున్నారట. టీడీపీలో గెలిచి అధికార పార్టీలోకి జంప్ చేసిన ఈ ఎమ్మెల్యేలు పరిస్థితి అధికార పార్టీలో అయోమయంగా, గందరగోళంగా తయారైందట.
విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ రాజీనామా చేయటంతోనే అందరిలో ఈ చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే వాసుపల్లి వైసీపీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కాదు. 2019లో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పొసగక పార్టీకి దూరమయ్యారు. అలా వాసుపల్లి గణేష్‌తో పాటు సైకిల్ దిగిన వారిలో మద్దాలి గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ ఉన్నారు.
వాస్తవానికి, అధికార పార్టీ నుంచి ఏవో ప్రయోజనాలు ఆశించి ఈ నలుగురు వైసీపీకి దగ్గరయ్యారన్నది క్లియర్. అయితే అప్పటికే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నేతలతో ఈ ఎమ్మెల్యేలకు సహజంగానే పడటం లేదు. అదీగాక, అధికార పార్టీలో నాయకులుగా చెలామణి అవుతున్న నేతలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైగా గన్నవరం, విశాఖ సౌత్, చీరాల, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకే వైసీపీ తరుపున నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. దీంతో వైసీపీలోని నేతలకు, వైసీపీకి దగ్గరైన టీడీపీ ఎమ్మెల్యేలకు పడటం లేదట.
ఇలా ఈ నలుగురిలో అటో, ఇటో కాస్త కరణంకు తప్ప మిగిలిన ముగ్గురికి వైసీపీ స్థానిక నేతల నుంచి సెగలు ఎక్కువైపోతున్నాయట. ఈ సెగను తట్టుకోలేకే తాజాగా వాసుపల్లి గణేష్‌కుమార్ నియోజకవర్గం సమన్వయకర్తగా రాజీనామా చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గణేష్‌ను సమన్వయకర్తగా నియమించినా అప్పటికే ఆ హోదాలో ద్రోణంరాజు సుధాకర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఒక్క వాసుపల్లే కాకుండా, మిగిలిన ముగ్గురు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.
ఇందాక చెప్పుకున్నట్టు నలుగురిలో కరణం పరిస్ధితే కాస్త మెరుగ్గా ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వల్లభనేని వంశీ పరిస్థితి అయితే మరీ ఘోరంగా, దారుణంగా తయారైందని ఆయన అనుచరులు వాపోతున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బలమైన దుట్టా రామచంద్రరావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోందట. అది ఎంతవరకు ముదిరిందంటే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసే పరిస్థితి వంశీకి దక్కతుందా దుట్టాకు దక్కుతుందా? అన్నంత ఆసక్తి కనిపిస్తోంది. చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎవరికిస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది. ఎలాగూ టీడీపీకి దూరమైన తమకే అధినేత టికెట్లు ఇస్తారన్న నమ్మకంతో ఉన్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీతోనే కొనసాగుతామని చెబుతున్నా చివరకు ఏమవుతుందో చూడాలి.