సుప్రీంకోర్టు : ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యక్తిగతంగా సమర్థిస్తాం.. కానీ..

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై అమలుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని..

Update: 2020-10-07 02:46 GMT

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై అమలుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే అన్నారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వకుండా తదుపరి ఉత్తర్వులను వారానికి వాయిదా వేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, న్యాయవాది మెహ్‌ఫూజ్‌ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే అనేకమంది దళిత, మైనారిటీ, నిరుపేద విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని వాదించారు. అయితే ఇదే తరహా పిటిషన్ ను కర్ణాటక కూడా వేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. రెండు కలిపి విచారిస్తామని పేర్కొంది.

అయితే ఇది అత్యవసరంగా వినాల్సిన పిటిషన్ అని ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే దీనిపై స్పష్టత రావాల్సి ఉన్న అంశమని న్యాయవాది విశ్వనాథన్‌ పేర్కొన్నారు. స్కూళ్లలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఒకవేళ ఎవరైనా తెలుగు మీడియం కావాలంటే వారికోసం మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేసి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అలాంటి ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిందన్నారు న్యాయవాది. ఈ సందర్బంగా వ్యాఖ్యానించిన బాబ్డే.. వ్యక్తిగతంగా మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. అలాగే ఈ ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులు అదే అభిప్రాయంలో ఉన్నారు. ఇంగ్లిష్‌ మన జీవితంలో భాగమైంది.. కానీ మా అభిప్రాయాలను విచారణలో ఆపాదించాలని అనుకోవడం లేదు. సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పిల్లలకు మాతృభాషలో పునాది పడడం చాలా ముఖ్యం.. రష్యా, చైనాతోపాటు చాలా దేశాల్లో మాతృభాషలోనే చెబుతున్నారన్నారు.. అలాగే ప్రాంతీయభాషల్లో చదువుకున్నవారు ఏకాకులుగా మిగిలిపోతారనడం కూడా సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News