Andhra Pradesh: ఏపీలో అత్యల్ప ఉత్తీర్ణతా శాతంలో టెన్త్‌ రిజల్ట్స్.. 20 ఏళ్లలో ఎన్నడూ లేని ఫలితాలు

Andhra Pradesh: 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తే.. 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్

Update: 2022-06-08 04:38 GMT

Andhra Pradesh: ఏపీలో అత్యల్ప ఉత్తీర్ణతా శాతంలో టెన్త్‌ రిజల్ట్స్.. 20 ఏళ్లలో ఎన్నడూ లేని ఫలితాలు

Andhra Pradesh: ఏపీలో పదోతరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. 20 ఏళ్లలో ఎన్నడూ లేని ఫలితాలు కనిపించాయి. అత్యల్ప ఉత్తీర్ణతాశాతంలో ఈసారి వచ్చిన ఫలితాలే అత్యల్పం. సుమారు 71 పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. అయితే ఈ ఫలితాలకు కారణమేంటి..? సరిగా పరీక్షలు రాయని విద్యార్ధులదా..? లేక విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోని సర్కారుదా...? అనే ప్రశ్నలను ప్రజలను వెంటాడుతున్నాయి.

ఏపీలోని పదో తరగతి ఫలితాలపై ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తే అందులో 2 లక్షల ఒక వేయి 627 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఉమ్మడి ఏపీలో 2002 లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే దాదాపు 20 ఏళ్లుగా కనబడని అత్యల్ప ఉత్తీర్ణత నమోదైంది. దీంతో టీచర్లలోనూ, ఇటు విద్యార్ధులు.. వారి తల్లిదండ్రుల్లోనూ, మరోవైపు రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. 2019 లో 94.88 ఉత్తీర్ణతా శాతం ఉంటే, కరోనా వల్ల 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్ధులందరూ ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు.

అయితే 2 సంవత్సరాల విరామం తర్వాత ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రారంభం నుండే వివాదానికి కారణమయ్యాయి. పరీక్షలు ఆరంభమైన మొదటి మూడు రోజులూ ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం రేగింది. ఆ తర్వాత ఈ లీకేజ్ వ్యవహారంలో అరెస్టులు, రాజకీయ పరిణామాలు, మాజీ మంత్రి నారాయణ అరెస్టు.. ఇతరత్రా జరిగిన పొలిటికల్ డ్రామా అంతా విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురిచేసింది. ప్రతి విద్యార్ధి జీవితంలో వారి కెరీర్ కు పదో తరగతి ఫలితాలు కీలకం. ఇలాంటి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. అధికారులు నిబంధనలు పాటించటం, పరీక్షలు సజావుగా జరగటంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏదో ఒకరోజు లీకేజీ జరిగిందంటే పర్వాలేదు..అదేపనిగా ప్రతి పరీక్ష ప్రజల సహనానికి పరీక్షలు పెట్టింది.

ఇలాంటి పరిస్థితుల్లో రిలీజైన పదోతరగతి ఫలితాలు మరోసారి చర్చకు దారితీశాయి. వాస్తవానికి ఈ నెల 4న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ముందే ప్రకటించారు. ఫలితాలను వెల్లడించే వేదిక వద్దకు మీడియా మొత్తం చేరుకుంది. ఉదయం 11 గంటలకు ప్రకటన అని చెప్పారు. ఆ సమయం దాటుతున్న అధికారుల జాడ లేదు. ఇదేంటని ఆశ్చర్యానికి గురై చూస్తున్న మీడియాకు చావుకబురు చల్లగా చేరింది. సాంకేతికపరమైన కారణాల వలన పదోతరగతి ఫలితాల విడుదల వాయిదాపడింది. 6న ఫలితాలను వెల్లడిచేస్తామన్నది మంత్రి బొత్స కార్యాలయం నుండి వచ్చిన సందేశం. దీంతో పరీక్షల నిర్వహణే కాదు, కనీసం ఫలితాలను కూడా సరిగా ప్రకటించరా అన్న విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి.

అయితే విపక్షాల విమర్శల్ని వైసీపీ ప్రభుత్వం తిప్పికొడుతోంది. పరీక్ష పత్రాల లీకేజ్ చేసింది టీడీపీతో సంబంధాలు ఉన్న విద్యాసంస్థలవేనని తేల్చిచెబుతోంది. ఇందులో పాత్ర ఉన్న సుమారు 80 మందిని అరెస్టు చేశామనీ, పూర్తి విచారణ జరుగుతోందని విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.

అయితే అటు విపక్షాలు, ఇటు ప్రభుత్వాల వాదన ఎలా ఉన్నప్పటికీ బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్ధులకు అన్యాయం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మళ్లీ సప్లిమెంటరీలు, రీ వాల్యుయేషన్ లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే ఆర్ధిక స్తోమత లేక కొందరు విద్యార్థులు మానసిక క్షోభకు గురువుతున్నారు. ఇప్పటికే ఈ ఫలితాల వచ్చాక ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

Full View


Tags:    

Similar News