ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన కొత్త సమీకరణలు
AP Politics: ఆంధ్రాలో ఒక ఆనందకరమైన శుభారంభం జరిగింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశాక ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
AP Politics: ఆంధ్రాలో ఒక ఆనందకరమైన శుభారంభం జరిగింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశాక ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారం అందుకునే క్రమంలో కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు తమ ప్రయోగం సక్సెస్ అయిందని నిరూపించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మూడు పార్టీలకు చోటు దక్కినా టీడీపీ మాత్రమే అల్టిమేట్ రోల్ పోషించడం ఖాయమంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఏపీ రాజకీయాల్లో టీడీపీ హవానే కొనసాగుతుందా?
కడలి కెరటాలే తమకు ఆదర్శం అంటారు పాజిటివ్ థింకర్స్. ఎందుకంటే కెరటం కింద పడిపోయినా మళ్లీ లేస్తుంది కాబట్టి. ఇదే స్ఫూర్తి నియమం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకూ వర్తిస్తుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ దిశగా పయనిస్తున్నా.. అచ్చం కెరటం లాగే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందంటారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాకు తొలి సీఎం అయ్యి.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ఒడ్డున పడేసే అద్భుతమైన అవకాశం చంద్రబాబుకు వచ్చింది. అయితే అనేక కారణాల చేత ఆ అవకాశాన్ని బాబు సరిగ్గా ఉపయోగించుకోలేదంటారు. అందుకే 2019లో అధికారాన్ని చంద్రబాబు నుంచి జగన్ కు అప్పగించారు. దీంతో టీడీపీ ఎన్నడూ లేని ఒత్తిడిని ఎదుర్కొంది. ఇక చంద్రబాబునాయుడి పని కూడా అయిపోయిందనుకున్నారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజల తీర్పు అనూహ్యంగా మారిపోయింది. మళ్లీ సీఎం చంద్రబాబే అయ్యారు. మొదటి ఐదేళ్లలో అనుసరించిన తీరు వల్లే రెండో ఐదేళ్ల అధికారం కోల్పోయామన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఈసారి పవర్ పగ్గాలు చేపట్టాలంటే పాత పొరపాట్లు అధిగమించాల్సిందేనని పంతం పట్టారు. ఫలితంగా కూటమిని సాకారం చేసి.. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఏపీ ప్రజల ఆశలు తీర్చే అవకాశాన్ని మళ్లీ అందుకున్నారు.
చంద్రబాబు రెండో ప్రమాణ స్వీకార మహోత్సవంలో గతంలో కనిపించని దృశ్యం సందడి చేసింది. నారా పరివారం, నందమూరి పరివారం, కూటమి పరివారం.. అంతా ఒక్కటైన దృశ్యం ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ మనోహర దృశ్యమేనంటున్నారు విశ్లేషకులు. కేంద్రం నుంచి ఎన్డీయే కీలకమైన నేతలు, ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఇతర బీజేపీ నేతలు కేసరపల్లి ప్రాంగణంలో కేక పుట్టించారు.
కేసరపల్లి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మూడు ప్రధాన కుటుంబాలు ఒక్కటిగా కనిపించడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా టీడీపీ నుంచి రెండు కుటుంబాలు రాజకీయంగా చక్రం తిప్పుతున్నాయి. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ... బావ చాటు బావమరిదిగా మారిపోవడం.. నారా కుటుంబానికి ఓ వరంగా మారింది. హరికృష్ణ ఉన్నప్పుడు చంద్రబాబుతో విభేదించినా.. బాలకృష్ణ మాత్రం చంద్రబాబు రాజకీయాలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. కూతురు బ్రాహ్మణిని నారా లోకేశ్ కు ఇచ్చి పెళ్లి చేయడంతో నారా, నందమూరి కుటుంబాల బంధం మరింత ఆత్మీయంగా పెనవేసుకుంది. బాబుతో నందమూరి కుటుంబం నుంచి పూర్తి కోపరేషనే తప్ప.. ఏ దశలోనూ వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ అయినా, బాలకృష్ణ ఫోకస్ అయినా నారా లోకేశ్ ను రాజకీయంగా రాణించేలా చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక బాలకృష్ణ మరో అల్లుడు శ్రీభరత్ విశాఖ నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన కూడా టీడీపీ నుంచే పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా శ్రీభరత్ పోటీ చేసినా స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు నాలుగున్నర లక్షల పైచిలుకు ఓట్లతో బంపర్ మెజారిటీ సాధించడం విశేషం. బాలకృష్ణ పెద్దల్లుడు లోకేశ్ పార్టీ బాధ్యతలు వహిస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టారు. కేబినెట్ మినిస్టర్ అయ్యారు. ఇంతకుముందు లోకేశ్ పార్టీని నడిపించగలరా అన్న అనుమానాలు వెనక్కి నెడుతూ.. తన సామర్థ్యం ఎలాంటిదో ప్రజాక్షేత్రం ద్వారా నిరూపించుకున్నారు లోకేశ్. గీతం విద్యాసంస్థలు నిర్వహిస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న మరో అల్లుడు శ్రీ భరత్.. టీడీపీకి, చంద్రబాబుకు సైనికుడిగా పనిచేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టయినప్పుడు భార్య భువనేశ్వరి మాత్రమే గాక.. నారా లోకేశ్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. ఇలాంటి ముఖ్యనేతలంతా బాబు కోసం, టీడీపీ కోసం పని చేశారు. అదే ఆత్మీయ బంధం వారి మధ్య వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని పదికాలాలపాటు ప్రజాసేవలో ఉంచేలా చేసే బాలయ్య బాధ్యతగా ఫీలవుతున్నారంటారు విశ్లేషకులు. మరోవైపు నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీద కొంతకాలం క్రితం వరకు రాజకీయ ఊహాగానాలు వినిపించినా.. ఆ దిశగా ఆ ఆలోచన ఏదీ జూనియర్ ఎన్టీఆర్ కు లేదని తేలిపోయింది. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలేవీ లేవంటున్నారు. తొందరపడి పొరపాటు నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం జూనియర్ కు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ గురించి దృష్టి సారించే అవకాశం లేదంటున్నారు. నారా ఫ్యామిలీతో కలిసిపోవడంతో వచ్చే సానుకూలత.. వ్యతిరేకతలో ఉండదని జూనియర్ గ్రహించారంటున్నారు. సో.. నారా, నందమూరి కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలకు అణువంత కూడా అవకాశం లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఆ విధంగా ఆ రెండు కుటుంబాలూ ఒక్కటై ముందుకు సాగుతుండగా ఇప్పుడు కొణిదెల ఫ్యామిలీ కూడా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సందర్భం తలెత్తిందంటున్నారు. ఒకప్పుడు కొణిదెల కుటుంబం నుంచి ప్రజారాజ్యం స్థాపించి రాజకీయ వాటా కోసం దూసుకొచ్చిన చిరంజీవి.. ఆ తరువాత కొంతకాలానికే కాడి కింద పడేశారు. కానీ అన్న స్థాపించిన పార్టీతో రాజకీయాల్లో ఎంటరైన పవన్ మాత్రం తన ప్రస్థానాన్ని ఆపలేదు. ఆలస్యంగానో, అడపాదడపాగానో తన రాజకీయ వేదికను పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. పదేళ్ల ప్రస్థానంలో కూటమి కోసం ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేసి అందరికీ మేలు జరిగేలా చేశాడు పవన్ కళ్యాణ్. ఏపీలో మొదటిసారిగా కూటమికి పట్టం కట్టించి తాను అసలైన సేనాని అనిపించుకోవడం విశేషం.
అప్పట్లో చిరంజీవి సొంతంగా పోటీ చేసి.. అధికారాన్ని ఆశించారు. కానీ పవన్ సొంతంగా మేజిక్ చేయాలనే అత్యుత్సాహానికి పోకుండా అంతా కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే.. ఆయన్ని పరామర్శించి వచ్చి కూటమి గురించి బహరింగ ప్రకటన చేశారు. అయితే ఆ రోజు పవన్ చర్యను వ్యూహం లేని తొందరపాటు చర్యగా పలువురు అభివర్ణించినా తన స్టాండ్ సరైందేనని రిజల్ట్ వచ్చాకే రుజువవడం విశేషం. ఈ చర్యతో టీడీపీకి, చంద్రబాబుకు పవన్ బయటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆత్మీయ వ్యక్తి అయిపోయారు. నారా, నందమూరి ఫ్యామిలీలు కలిసి ఉండడం పెద్ద విషయం కాకపోయినా నారా, కొణిదెల ఫ్యామిలీలు కలిసి ఉండడం మాత్రం కచ్చితంగా విశేషమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
రాజకీయ రంగంలో తన శ్రమతో, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చిన పవన్ కు రాష్ట్రంలో, కేంద్రంలో ఇప్పటికే ఓ ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంలో పవన్ కు మరింత మంచి ఫౌండేషన్ ఉన్నా.. రాష్ట్రంలో చంద్రబాబు అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉందంటున్నారు. రేపు ఎప్పుడైనా అనుకోని సమస్యలు తలెత్తినా పవన్ ను మరింత జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉందంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన సామాజికవర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యేను గెలిపించుకున్న పవన్.. ఈసారి తన సామాజికవర్గాన్ని మాత్రమే గాక.. తాను బరిలో నిలిపిన అందరినీ గెలిపించుకుని.. ఏపీ రాజకీయాల్లో ఓ బలమైన శక్తిగా ఎదిగారు. అలా కొణిదెల ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దూసుకొచ్చినట్లయింది. మరి నందమూరి, నారా మధ్య కుదిరిన బలమైన కెమిస్ట్రీనే.. కొణిదెల ఫ్యామిలీతోనూ కుదురుతుందా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమిలోని మూడు పార్టీలే గాక.. మూడు ఫ్యామిలీల ప్రాధాన్యం కూడా పెరిగిన ఏపీలో రేపటి రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.