పెన్నానదికి వరద ఉధృతి.. నిండుకుండలా సోమశిల జలాశయం
* ఇన్‌ఫ్లో 18వేల క్యూసెక్కులు * 5,6,7 గేట్ల ద్వారా 19,550 క్యూసెక్కుల నీరు విడుదల
Penna River - Somasila Dam: ఎగువన కురుస్తున్న వర్షాలతో పెన్నానది ఉరకలెత్తుతోంది. సోమశిల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. సుమారు 18 వేల క్యూసెక్కుల వరదప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే 71.5 టీఎంసీలతో సోమశిల జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో 5, 6, 7 గేట్లు ఎత్తి 19వేల 550 క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేస్తున్నరు అధికారులు.
ఎగువ నుంచి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని యధావిధిగా విడుదల చేయాలని నిర్ణయించారు. అల్పపీడనం ప్రభావంతో జలాశయానికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలలో ఎవరు నదిలోకి వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు.