ఖమ్మం పాత బస్టాండ్‌లో నిరుపయోగంగా సోలార్ పవర్ ప్లాంట్...
Solar Power Plant: *30 లక్షలతో ఏర్పాటు చేసిన వైనం *ఏడాది నుంచి పనికిరాకుండా పోయిన పవర్ ప్లాంట్
Solar Power Plant: ఖమ్మం పాత బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యానికి లక్షల రూపాయల విలువైన సోలార్ పవర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కొత్త బస్టాండ్ ప్రారంభమై ఏడాది కావొస్తున్నా సోలార్ ప్లాంటును పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం నగరం నడిబొడ్డున కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్టాండ్‌ను నిర్మించారు. ఈ ప్రయాణ ప్రాంగణం ప్రారంభించినపుడు పాత బస్టాండ్‌లో ఉన్న ప్రతీ వస్తువును యుద్ద ప్రాతిపదికన తరలించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా పాత బస్టాండ్‌లో విద్యుత్ అవసరాల కోసం దాదాపు 30 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంటును మాత్రం తరలించలేదు. వాస్తవానికి ఈ ప్లాంటు ద్వారానే బస్టాండ్ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరిగేది. తద్వారా విద్యుత్ బిల్లుల భారం కూడా చాలా వరకు తగ్గిపోయేది. కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తి చేశాక సోలార్ ప్లాంటు కూడా తరలించాలని అధికారులు భావించారు. కానీ తరలించలేదు.
దీంతో సోలార్ ప్లాంటు పరికరాలు పనికిరాకుండా పోతున్నాయి. వేసవి తీవ్రత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. మరోవైపు విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం అని నగర వాసులు అంటున్నారు.