Social Media War in AP: ఏపీలో మరింత ఎరుపెక్కుతున్న రెడ్ బుక్

Update: 2024-11-19 15:26 GMT

Whats happening in AP: ఏపీలో రెడ్ బుక్ మరింత ఎరుపెక్కుతోంది. సోషల్ మీడియా వార్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. నిన్న బూరగడ్డ అనిల్, వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్... ఆ తరువాత రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని... ఈ ముగ్గురి అరెస్ట్ తప్పదా? రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఏం చెబుతున్నాయి? ఇప్పటికే పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు అందించారు. మరోవైపు స్టేషన్లలో థర్డ్ డిగ్రీ అమలు చేస్తున్నారా అని మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీస్తున్నారు. ముందుగా అరెస్టులు తనతోనే మొదలుపెట్టమని సవాల్ విసురుతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబు సర్కార్ సోషల్ మీడియా చట్టానికి పదునుపెడుతోంది. ఇవే అంశాలను విశ్లేషిస్తూ ఏపీలో అసలేం జరుగుతుందో నేటి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

సోషల్ మీడియా వార్ ఫస్ట్ ఆఫ్‌కి చేరింది..లోకేష్ రెడ్ బుక్ మరింత ఎరుపెక్కుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లకు లెక్కకు మించిన ఫిర్యాదులు అందుతున్నాయి.

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరబాద్ వెళ్ళి రాంగోపాలవర్మకు నోటీసులు ఇచ్చారు. కొడాలినానిపై తొలి కేసు విశాఖలో నమోదయింది. పోసానిపై కూడా రోజుకో పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో చంద్రబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులనూ, టీడీపీలోని ఇతర నేతలను అసభ్యకర పద జాలంతో దూషించారనేది ప్రధాన ఆరోపణ

‘బూతులు తిట్టిన వారిపై కేసులు పెట్టటాన్ని ఎలా ఆపగలం’ అంటూ హైకోర్టు కూడా వ్యాఖ్యానించటంతో వైసీపీ నేతలపైనా, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపైనా కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. అరెస్ట్ చేసిన వారిపై థర్డ్ డిగ్రీ అమలు చేస్తున్నారనీ, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రవధలకు గురి చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ‘‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం.. చంద్రబాబు సర్కారు వైఫల్యాలపై నేను కూడా పోస్టులు పెడతాను.. అరెస్ట్ నా దగ్గర నుంచే మొదలు పెట్టండి’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైసీపీలో జోష్ పెంచాయి.

అసభ్య పదజాలం, బూతుల వాడినీ, వేడినీ తగ్గించి కూటమి హామీల వైఫల్యంపై ప్రశ్నలు సంధిస్తూ, నిలదీస్తూ సోషల్ మీడియాను మరింత పదునెక్కించాలని వైసీపీ తన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసింది. అందువల్లనే జగన్ స్టేట్ మెంట్ తరువాత వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు మరింత పెరిగాయి.

మరో వైపు ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళను గురి చూసి కొడుతోంది. కేసులపై కేసులు బుక్కువుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీలో టాప్ లీడర్లను కూటమి సర్కార్ టచ్ చేయలేదు. వేధింపులన్నీ కింది స్థాయి లీడర్లకు పరిమితమయ్యాయి.

రెడ్ బుక్ లో ఒక్కొక్క పేజీని తిరగేస్తున్న చంద్రబాబు, లోకేష్ అండ్ కో యాక్షన్ ప్లాన్ రాంగోపాల్ వర్మ..పోసాని కృష్ణ మురళి, ..కొడాలి నాని వరకూ వచ్చింది. వీళ్ళను అరెస్ట్ చేయటానికి అవసరమైన గ్రౌండ్ ను పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సర్కారు ఎపుడు సైగ చేస్తే అపుడు వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. అసలు అరెస్ట్ చేస్తారా, లేదా.. కేవలం మైండ్ గేమ్ కే పరిమితమవుతారా అనే ఉత్కంఠ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ ముగ్గురూ ఒకరి తరువాత మరొకరు జైలు కెళ్లటం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. వైసీపీకీ, జగన్ కు కూడా ఈ సంకేతాలందాయి. ప్రధాన లీడర్లను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనే విషయంపై జగన్ ప్రతిరోజూ తమ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు.

తన భర్త ఇంటూరి రవికిరణ్ ను రోజుకొక పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ చిత్రవధకు గురి చేస్తున్నారని అతని భార్య సుజన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు పెట్టారు.. స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు రాగానే మరో పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నారు.. ఇలా రాష్ట్రమంతా తిప్పుతున్నారు..రవికిరణ్ ను హింసిస్తున్న పోలీసులపై ప్రయివేట్ కేసులు పెడతానని ఆమె అన్నారు.

బెంబేలెత్తిన శ్రీరెడ్డి..

కూటమి సర్కారు కదలికలతో శ్రీరెడ్డి బెంబేలెత్తిపోయింది. చంద్రబాబునూ, లోకేష్ నూ, పవన్ కళ్యాణ్ నూ, షర్మిలనూ.. ఇంకా అనేకమంది లీడర్లనూ, వారింట్లో ఆడవాళ్ళను రాయటానికి వీలులేని బాషలో నానా బూతులు తిట్టిన శ్రీరెడ్డి ఇపుడు వణికిపోతోంది..అన్నా క్షమించు అంటూ లోకేష్ కు లేఖ రాసే దాకా వచ్చింది. అయినా సరే ఫిర్యాదులు, కేసులు ఆగటం లేదు. శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె నోటి బారిన పడి నిద్రాహారాలు మానేసిన అనేకమంది నాయకులు లోకేష్ ను వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం.

పంచ్ ప్రభాకర్ ఎక్కడ...

అమెరికా నుంచి పంచ్ ల మీద పంచ్ లు విసురుతూ చంద్రబాబు అండ్ కో మీద పచ్చి బూతులు విసిరిన పంచ్ ప్రభాకర్ పై కూడా రెడ్ బుక్ కన్ను బడింది. ఆయన ఎక్కుడున్నా పిలిపించాలని పోలీసులకు హుకుం జారీ చేసింది. ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. అమెరికా నుంచి పిలిపించేందుకు అవసరమైన సాంకేతిక అవరోధాలన్నిటినీ తొలగించి సరైన సమయంలో పంచ్ ప్రభాకర్ ను కూడా ఆంధ్రాకు తీసుకొచ్చి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమవుతోంది.

విచారణకు ఆర్జీవీ గైర్హాజరు

పోలీసుల విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గైర్హజరయ్యారు. తాను విచారణకు రాలేనంటూ పోలీసులకు మెసేజ్ పంపించారు.. వ్యక్తిగత పనులున్నందున నాలుగురోజులు సమయం కావాలని, ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని ఆర్జీవీ పోలీసులకు పంపించిన మెసేజ్ లో తెలిపినట్టు సమాచారం.

ఎక్కాలు నేర్పిస్తున్నారు.. రేపు హెచ్చివేతలుంటాయి!

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు పెట్టి వేధిస్తున్నారు..అన్నీ చూస్తున్నాం.. లోకేష్, చంద్రబాబూ, పవన్ కళ్యాణ్.. మీరు ఎక్కాలు నేర్పిస్తున్నారు.. ఎక్కాలు ఇంతటితో ఆగవు..రేపు హెచ్చవేతలుంటాయి..కంగారేం లేదంటూ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు.

Full View

ప్రశ్నిస్తే కేసులా..

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై, హామీల అమలుపై ప్రశ్నిస్తున్న వారి గొంతులను పోలీసులతో తొక్కిస్తున్నారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదని, ధైర్యంగా ఎదుర్కొంటామని ఆమె అన్నారు.

చట్టానికి పదును పెడతాం.. అసెంబ్లీలో చంద్రబాబు

చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. సోషల్ మీడియా అరాచకాన్ని కట్టడి చేసేందుకు చట్టానికి పదనుపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.

ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్న చంద్రబాబు, గత ప్రభుత్వం సోషల్ మాఫియాను తయారుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేత వైఎస్ జగన్ కూడా తమ పోరాటం ఆగదని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగింది సోషల్ మీడియా వార్‌లో ఫస్టాఫ్ మాత్రమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి సెకండాఫ్, క్లైమాక్స్ ఎలా ఉండబోతోందన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News